నిన్నటి వరకూ ప్రత్యేక తెలంగాణ సాధనకు తమ తమ పక్షాల తరపున ఒత్తిళ్లు తెచ్చేందుకు హస్తినలో మకాం వేసిన నేతలు శనివారం జిల్లాకు తరలిరావడంతో అంతటా ఆనందం అలుముకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలను ఆయా పార్టీల శ్రేణులు, అభిమానులు భారీ ఊరేగింపులతో ఆహ్వానించారు. రాష్ట్ర సాధనకు తమ పార్టీలు చేసిన కృషిని చెప్పుకొని మురిసిపోయారు. రంగులు చల్లుకున్నారు. మేళతాళాలతో ఆడి,పాడారు. నవతెలంగాణను ఘనంగా స్వాగతించారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: తెలంగాణ సాధించిన ఘనత బీజేపీదేనని ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ‘జై బోలో తెలంగాణ, ఇది కోటి రతనాల వీణా’ అన్న నినాదాలతో జిల్లా కేంద్రం మార్మోగింది. పార్లమెంట్‌లో ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత శనివారం ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు, విద్యార్ధినీలు వీర తిలకం దిద్ది విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి మెట్టుగడ్డ, న్యూటౌన్, బస్టాండు మీదుగా క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నాగం, యెన్నంలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విషయంలో మాట తప్పకుండా, మడప తిప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని, ఇది ముమ్మాటికీ బీజేపీ విజయమేనన్నారు. సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు పన్నినా సుష్మాస్వరాజ్ వాటిని భగ్నం చేశారన్నారు. తెలంగాణను అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో బీజేపీ 20 రోజుల పాటు చొరవ చూపి, ఇచ్చిన మాటకోసం కృషి చేసిందన్నారు.
బంగారు తెలంగాణ, నవ నిర్మాణ తెలంగాణ స్థాపనకు కృషి చేయడంతో పాటు, జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్‌డీఏను అధికారంలోకి తెచ్చి నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేస్తే దేశం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కో చైర్మన్ నాగూరావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రాములు, కొండయ్య, జాతీయ మహిళ మోర్చ నాయకురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.రతంగపాండురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పడాకుల బాలరాజు, శ్రీవర్ధన్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాది రాంమోహన్, ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.