
ఘనంగా రంజాన్
అంతటా భక్తి భావం.. అందరి నోటా అల్లాహ్ గురించి ప్రశంస.. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు.. సహృద్భావ వాతావరణం.. ఆహ్లాదం గొలిపిన అత్తరు పరిమళాలు.. సోదర భావం తెలుపుతూ ఆలింగనాలు... వెరసి శనివారం జిల్లాలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కడప నగరంలోని బిల్టప్ ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థన చేస్తున్న దృశ్యమిది. (ఇన్‌సెట్‌లో) పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కడప ఎమ్మెల్యే అంజద్‌బాష, మాజీ మంత్రి అహ్మదుల్లా, అమీర్‌బాబు, సుభాన్‌బాష, షఫీ తదితరులు
కడప కల్చరల్ : ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగాయి. కొందరు మసీదులలో ప్రార్థనలు చేయగా, ఎక్కువ శాతం మంది సమీపంలోని ఈద్గాలలో సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు.
పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరం బిల్టప్ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మత గురువు ముఫ్తీ న్యామతుల్లా పండుగ సందేశాన్ని అందజేశారు. ఈ పండుగ.. దైవం మానవులకు అందించిన గొప్ప వరమని, ఈ సందర్భంగా అల్లాహ్ సూచించిన మార్గాన్ని జీవితాంతం కొనసాగించాలని సూచించారు. మనం చేసే కార్యక్రమాల్లో అడుగడుగునా అల్లాహ్ తోడుండాలని కోరాలన్నారు. జీవితాంతం ఉత్తమ మార్గంలో పయనించేందుకు ఆయన నుంచి శక్తిని కోరుదామన్నారు.
చాలా మంది ఈ ప్రపంచం తమదేనని గర్వం వ్యక్తం చేస్తున్నారని, నిజానికి ఒక్క అడుగు స్థలాన్ని కూడా తీసుకు వెళ్లలేరని ఆయన గుర్తు చేశారు. మానవుడిలోని చైతన్యం పూర్తిగా అల్లాహ్ దయ మాత్రమేనని తెలుసుకోవాలన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ భక్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రాంగణంలో ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు.
ఘనంగా ఏర్పాట్లు
ఎండ ఇబ్బంది ఉండకూడదన్న భావంతో కార్యక్రమ నిర్వాహకులైన జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు బిల్టప్ ఈద్గా మైదానంలో పూర్తిగా షామియానా వేశారు. మంచి నీటికి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను ముందే మళ్లించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగలేదు. పోలీసు సిబ్బంది అడుగడుగునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్‌ఎండీ అహ్మదుల్లా, ఎమ్మెల్యే అంజద్‌బాష, ఆయన సోదరుడు అహ్మద్‌బాష, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అమీర్‌బాబు, జిలానీబాష, సంఘ సేవకులు సలావుద్దీన్, సుభాన్‌బాష, దుర్గాప్రసాద్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అలీ, షఫీ, దర్గా ప్రతినిదులు నయీం, అమీర్‌తోపాటు నగరానికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు.