రంజాన్కు సర్వం సిద్ధం
♦ నేడు ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన నెల రోజుల రోజాలు
♦ వేడుకలకు సిద్ధమవుతున్న ముస్లింలు
♦ నోరూరించనున్న షీర్‌ఖుర్మా
♦ ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాల ముస్తాబు
♦ 30 రోజుల ఉపవాసాలను విశ్వాసులు పూర్తి చేశారు.
ఇక పండగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ బుధవారంతో ముగిసింది. షవ్వాల్ మాసంలోని మొదటి రోజున(గురువారం) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఈ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
తలస్నానంతో మొదలు
ముస్లింలు పండగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి.. ఈతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఁఈద్-ముబారక్* అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రంజాన్ రోజున షీర్‌ఖుర్మా చేసుకొని నోరు తీపి చేసుకుంటారు. ఆ రోజు ప్రతిచోట పవిత్రత, పరిశుద్ధత వెల్లివిరుస్తాయి. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, విధేయతా భావాలతో, ఉన్నతమైన నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ధనికులు, పేదలు అనే తారతమ్యం లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్య పాటిస్తారు. ఈ పండగ మానవుల వ్యక్తిగత జీవితాన్ని, సాంఘిక స్థితిని, ఆరోగ్యకర పద్ధతుల్లోకి మలచి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పుతుంది. పండగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్ దీక్షలు విశ్వాసులు పాటిస్తారు.
ఫిత్రా దానం
పండగ రోజున నమాజ్‌కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండగకు ఈద్-ఉల్-ఫితర్ అని పేరు వచ్చింది. ఉపవాసాల పాటింపులో మనిషి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. వాటి పరిహారార్థం చేసే దానమే ఫిత్రా. దీని ద్వారా నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా, ఇతరులతో పాటు పండగ వేడుకల్లో పాల్గొని, మంచి వస్త్రాలు ధరించి, మంచి వంటకాలు అరగించే వీలు కలుగుతుంది. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు కానీ, తూకానికి సరిపడా పైకాన్ని గానీ కడు నిరుపేదలకు ప్రతి ముస్లిం దానం చేయాలి.
జకాత్
ఇస్లాం నిర్థేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అంటే దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరు తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్థేశించబడిన సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల నూ వెల కట్టి, అందులో నుంచి 2.5 శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. రంజాన్ నెలలోనే జకాత్‌ను చెల్లించడం అత్యంత పుణ్యదాయకంగా భావిస్తారు.
పలు విషయాలు అవగతం
ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అదుపులో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించడం సర్వసాధారణం. 30 రోజుల పాటు పాటించే దీక్షల్లో చుక్క నీరు కూడా సేవించరు. ఇలా 30 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష చేస్తారు. తద్వారా రంజాన్ మాసంతో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం కలుగుతుంది. ఆకలిదప్పుల విలువ తెలుస్తుంది.
దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించుకుపోతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణ, సర్వ మానవ సౌభ్రాతృత్వం తదితర గుణాలు దరిచేరుతాయి. ఇన్ని ప్రత్యేకతలతో సాగే రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలతో ముగుస్తుంది. ఇహలోకంలో ఆచరించే ఇలాంటి కఠోర దీక్షలు పరలోకంలో రక్షణగా ఉండి కాపాడతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. రంజాన్ నెలలో ఉపవాసాలతో, దానధర్మాలతో గడిపినవారి ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై, అగ్ని సంస్కారం పొందిన బంగారంలా మోము దివ్యకాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు.
మత సామరస్యానికి ప్రతీక
రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కుల, మత భేదాలు లేకుండా హిందువులు, క్రైస్తవులు.. ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. వివిధ కుల సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పండగ రోజున ఈద్గాలకు వెళ్లి ఈద్-ముబారక్ చెబుతారు.
పండగ శుభాకాంక్షలు
సిద్దిపేట జోన్: మత సామరాస్యానికి పవిత్ర రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన బుధవారం పత్రికా ముఖంగా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహించిన మొదటి ప్రభుత్వం తమదేనని గుర్తుచేశారు.
సోదర భావానికి దోహదం
జహీరాబాద్: జహీరాబాద్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ జె.గీతారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరుపుకోనున్న రంజాన్.. ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పండగలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు.