కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్‌కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము.
కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్‌లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్‌అయ్యాయి.
హిందువులకు మసీదులో ఆశ్రయం
వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్‌లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు.
‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు
కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది.
బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
Comments
Please login to add a commentAdd a comment