కర్నూలు: రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ముస్లింలు ఈద్గాలకు బయలుదేరారు. నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఇక్కడ ఖాజీ సలీం బాషా నమాజు చేయించారు.
ఈద్గా లోపల స్థలం సరిపోక.. ఆనంద్ టాకీస్ బ్రిడ్జి వరకు ముస్లింలు రోడ్లపైనే నమాజు చేశారు. ఈ సందర్భంగా ఖాజీ సలీం బాషా ఈదుల్ ఫితర్ ప్రత్యేక సందేశాన్నిస్తూ.. రంజాన్ పండుగ ముస్లింలలో చక్కని క్రమశిక్షణకు, నియమబద్ధమైన జీవనానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. నెల రోజుల కఠినమైన ఉపవాస దీక్షలు ముస్లింలకు మానవీయ దృక్పథంతో పాటు సేవాభావాన్ని అలవరుస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి శాంతి సౌభాగ్యాలు కలగాలని దువా చేశారు. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఈ యేడాది భారీ సంఖ్యలో ముస్లింలు నమాజులో పా ల్గొన్నారు. మౌలానా జుబేర్ పేష్ ఇ మాంగా వ్యవహరించి ప్రత్యేక నమాజు చేయించారు. పాత ఈద్గాలో 9 గంటలకే నమాజు ప్రారంభం కావడంతో.. కొత్త ఈద్గాకు తాకిడి పెరిగింది.
నమాజులో పాల్గొన్న ఎమ్మెల్యే ఎస్వీ
ఈదుల్ ఫితర్ ప్రత్యేక నమాజులో కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు నగరంలోని పాత ఈద్గాలో ప్రారంభమైన ఈదుల్ ఫితర్ నమాజులో పాల్గొన్న ఆయన.. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పరిధిలోని రెండు ఈద్గాల్లోఉదయం 7 గంటలకే ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ముస్లిం మహిళలు కూడా నమాజులో పాల్గొన్నారు. హిందూ ముస్లింలు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం.
ట్రాఫిక్ మళ్లింపు
ఉదయం 8 గంటల నుంచి పాత, కొత్త ఈద్గాల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించారు. సి.క్యాంప్ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను రాజ్‌విహార్ సెంటర్ నుంచి వెంకటరమణ కాలనీ నుంచి హైవే వైపు మళ్లించారు. కొత్త ఈద్గా వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లారీలు బస్సులను నిలిపేశారు. నమాజు అనంతరం అన్ని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
భక్తిశ్రద్ధలతో ఈదుల్ ఫితర్
Published Sun, Jul 19 2015 3:16 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement