
సోనియా సంతృప్తి కోసం
17 ఎంపీ, 100 ఎమ్మెల్యే సీట్లు సాధించాలి
కాంగ్రెస్ కార్యాలయాలన్నీ ‘సోనియా భవనాలు’గా మార్చాలి
కృతజ్ఞతాభినందన సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పిలుపు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ర్యాలీగా రాక
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంతృప్తి చెందాలంటే... రాబోయే ఎన్నికల్లో 17 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని గెలిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అందుకోసం కార్యకర్తలంతా యోధుల్లా పోరాడాలన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తరువాత ఢిల్లీ నుంచి ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయా నేతలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గన్‌పార్కుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మంత్రులు కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, బసవరాజు సారయ్య, జి.ప్రసాదకుమార్, గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, రాపోలు ఆనందభాస్కర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సభలో వారు మాట్లాడుతూ, తెలంగాణ కోసం సోనియాగాంధీ చేసిన కృషిని వివరించారు. ఆమె రుణం తీర్చుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తీరాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన షబ్బీర్ అలీ కూడా సోనియాగాంధీని విశేషంగా కొనియాడారు. సభలో పలువురు ఎంపీలు నృత్యాలు చేస్తూ సంతోషం పంచుకున్నారు.
సోనియా భవనాలుగా కాంగ్రెస్ కార్యాలయాలు: జానారెడ్డి
‘‘భారతజాతి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుంది. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో లోక్‌సభ, రాజ్యసభలో చోటుచేసుకున్న ఉత్కంఠ తెలిసిందే. నిజానికి సోనియాగాంధీ గుండెలు నలిగాయి. మనసు చెదిరిపోయింది. అయినా ఆమె ప్రతి నిమిషం, ప్రతి క్షణం తెలంగాణ కోసం చేసిన కృషి మరవలేనిది. ఇప్పుడు కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలంటే, సోనియా ఆత్మను సంతృప్తి పర్చాలంటే వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ, 100 ఎమ్మెల్యే సీట్లు సాధించుకోవాలి. ఐక్యతతో తెలంగాణను సాధించుకున్నాం. అదే ఐక్యతతో కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం. ఏమైనా అనుమానాలున్నా, పొరపాట్లు జరిగినా నివృత్తి చేసుకోవాలి. కార్యకర్తలంతా యోధుల్లాగా పోరాడాలి. గ్రామగ్రామానికి వెళ్లి సోనియాగాంధీ విశ్వసనీయతను వివరించాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ భవనాలను సోనియా కార్యాలయాలుగా మార్చేలా కృషి చేద్దాం.’’
తెలంగాణ తల్లి సోనియా: గీతారెడ్డి
‘‘తెలంగాణ అరవయ్యేళ్ల పోరాటాన్ని, అమరుల త్యాగాలను గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ ప్రజల తల్లి. మన హృదయాల్లో ఆమెకు శాశ్వత స్థానం ఇవ్వాలి. ఆమె రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.’’
టీపీసీసీ సన్నాహక సభను తలపిస్తోంది:రాపోలు
‘‘తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు సన్నాహక సభను తలపిస్తోంది ఈ సభ. కాంగ్రెస్ విధాన ప్రకటన ఏ స్థాయిలో ఉంటుందో, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎలా అమలు చేస్తారో అని చెప్పడానికి తెలంగాణ ఏర్పాటే నిదర్శనం. విభజన వల్ల సీమాంధ్రలో అద్భుత అవకాశాలు రాబోతున్నాయి.’’
ర్యాలీ విశేషాలు...
ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పలువురు నేతలు విమానాశ్రయం టెర్మినల్ వద్ద హల్‌చల్ చేశారు. భూమిని ముద్దాడారు. జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి.
మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా వచ్చిన వాహనాలతో విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ స్తంభించింది. విమానాశ్రయంలోని మొదటి రోటరీ నుంచి టెర్మినల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ర్యాలీ మూడు గంటల తరువాత అసెంబ్లీ ఎదురుగానున్న గన్‌పార్కు వద్దకు చేరుకుంది. కళాకారులు ఆటపాటలతో, వాయిద్యాలతో సందడి చేశారు. గన్‌పార్కుకు వచ్చిన ఎంపీలు రాపోలు ఆనంద్‌భాస్కర్, మధుయాష్కి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాజయ్య, నిరంజన్ తదితరులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
బహిరంగ సభకు సమీపంలో బాణసంచా పేల్చినప్పుడు నిప్పురవ్వలు గాంధీభవన్ పైకప్పు వద్దనున్న వైర్లకు అంటుకున్నాయి. దీంతో మంటలు వ్యాపించాయి. పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.
ర్యాలీ సాగిన దారిపొడవునా కార్యకర్తల హంగామా కన్పించినా గాంధీభవన్ వద్ద బహిరంగసభకు మాత్రం జనసందోహం అంతగా లేదు. కుర్చీల్లో సగానికిపైగా ఖాళీగా కన్పించాయి.