నిను మరువము రాజన్నా.. | Grandly YS Rajashekarreddy Jayanthi in Kakinada | Sakshi
Sakshi News home page

నిను మరువము రాజన్నా..

Published Wed, Sep 3 2014 1:29 AM | Last Updated on Sat, Jul 7 2018 3:07 PM

నిను మరువము రాజన్నా.. - Sakshi

నిను మరువము రాజన్నా..

 సాక్షి, కాకినాడ :తమ గుండెగుడిలో కొలువైన వైఎస్సార్‌కు జిల్లావాసులు ఘనంగా నివాళులర్పించారు. దశాబ్దాలు గడిచినా ఆ మహనీయుడిని మరువబోమని నిరూపించారు. ఊరూవాడా ‘వైఎస్సార్ జోహార్’ అంటూ నినదించాయి. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజలు సైతం పార్టీ లు, మతాలకతీతంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమాన నేతకు ఘనంగా నివాళులర్పించారు. శాసన  సభలో పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్ పంజగుట్ట సెంటర్‌లోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు సేవా కార్యక్రమాలతో వైఎస్‌కు నివాళులర్పించారు.
 
 కాకినాడ గొడారిగుంటలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ సిటీ   కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహర్షి సాంబమూర్తి వికలాంగ పాఠశాల విద్యార్థులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రపాలెంలో నిరుపేదలకు అన్నదానం చేసి, దుస్తులు పంపిణీ చేశారు. కొవ్వాడ, కొవ్వూరు, రాయుడుపాలెంలలో వృద్ధుల ఆశ్రమాల్లో పండ్లు, పాలు పంపిణీ చేసి, ఆర్థికసాయం అందజేశారు.
 
 రాజమండ్రి సిటీలోని కోటగుమ్మం, లాలాచెరువు సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాష్ర్ట కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేశారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో పేదలకు వస్త్రదానం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో అంబాజీపేట సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి కుడుపూడి చిట్టబ్బాయి,
 
 మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్ తదితరులు క్షీరాభిషేకం చేశారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు, కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెదపూడిలో సుమారు 10 వేల మందికి అన్నదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో కడియం మండలం బుర్రిలంకలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, ఆర్థికసాయం అందజేశారు. పలుకు ఆశ్రమ పాఠశాలలో బధిరులకు పలకలు, పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు.
 
 ఆయా కార్యక్రమాల్లో జక్కంపూడి రాజా, సుంక ర చిన్ని తదితరులు పాల్గొన్నారు. కోరుకొండలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జగ్గంపేట సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ఆస్పతిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.మండపేటలో పార్టీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, పార్టీ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో అర్తమూరులో వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
 
 పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో పార్టీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సామర్లకోటలోని సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరంలో పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆలమూరులో మహిళా విభాగం మాజీ రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కొత్తపేటలో జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లో సైతం వైఎస్సార్ అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించడంతో పాటు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement