కిరణ్ పలకరింపు.. రఘువీరా చిరునవ్వు!
నేదురుమల్లి సంతాపసభలో తారసపడిన ఇద్దరు నేతలు.. కలవని మాటలు
హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనాంతర ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రఘువీరారెడ్డిలు ఎదురెదురుగా తారసపడినప్పటికీ ఇద్దరి మధ్య మాటలు కలవలేదు. తనకు సమీపంలో కూర్చున్న రఘువీరాను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బాగున్నారా ప్రెసిండెంట్ గారూ’ అని పలకరించగా.. రఘువీరా నుంచి చిరునవ్వు మాత్రమే బదులొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సంతాపసభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మితోపాటు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వేణుగోపాలరెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాయపాటి సాంబశివరావు, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి తన సహచరులందరితో కలివిడిగా మాట్లాడానికి ప్రయత్నించారు. తనపక్కనే ఉన్న జానారెడ్డితో ఎక్కువగా మాట్లాడుతూ గడిపారు.
పాలనాధక్షుడు నేదురుమల్లి: వక్తలు
మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంచి పాలనాధక్షుడని సంతాపసభలో వక్తలు కొనియాడారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు భిన్నంగా తనకు ఎంత కష్టమొచ్చినా పార్టీ వీడని వ్యక్తి అని కొనియాడారు. పార్టీపరంగా కేంద్ర స్థాయిలో తగినంత గుర్తింపు ఇవ్వకపోయినా పార్టీ మారలేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం రైతులకు లబ్ధి కలిగించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా నేదురుమల్లి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించే ప్రక్రియకు దేశంలో నాంది పలికింది నేదురుమల్లేనని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల పథకాన్ని ఆయన తెచ్చాకే కేంద్రం ఎంపీ లాడ్స్ పథకాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా, ఏ పదవీ లేనప్పడు మానవతావాదిగా నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కలిగివున్న వ్యక్తి నేదురుమల్లి అని జానారెడ్డి కీర్తించారు. 1983లో తనను రాజకీయాల్లో ప్రోత్సహించింది జనార్దన్‌రెడ్డినేనని మేకపాటి తెలిపారు. రాజకీయంగా పదేళ్ల విరామం తరువాత తిరిగి తాను నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేయడానికి నేదురుమల్లి సహకరిస్తే, వైఎస్సార్ ఆశీర్వదించారని చెప్పారు. జనార్దన్‌రెడ్డి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని రఘువీరా తెలిపారు.