గ్రౌండ్ వాటర్ డీడీపై నేడు, రేపు విచారణ
సాక్షి, కాకినాడ :అసిస్టెంట్ డెరైక్టర్లు, కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూగర్భ జల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం డిప్యూటీ డెరైక్టర్ ప్రసాదరావును విచారణాధికారిగా నియమిస్తూ ఆ శాఖ డెరైక్టర్ కె.వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరావు సోమ, మంగళవారాల్లో జిల్లాలో విచారణ చేపట్టనున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లోని ఏడీ కార్యాలయంలోను, మంగళవారం రాజమండ్రిలోను విచారణ జరపనున్నారు.
జిల్లాలో ఈ శాఖ పరిధిలో ముగ్గురు ఏడీలు ఉండగా, ఇటీవల ఒకరు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. కాగా కాకినాడ ఏడీ విజయ్‌కుమార్‌ను కార్యాలయంలోకి రానివ్వకుండా తాళాలు వేయడంతోపాటు రాజమండ్రి ఏడీని కాకినాడలో డెప్యూటేషన్‌పై నియమించారు. వీరితోపాటు రాజమండ్రి, కాకినాడ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారంటూ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ రెండు కార్యాలయాల్లోని పలువురు సిబ్బంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీడీ వెంకటేశ్వరరావుపై ఈ విచారణ జరగనుంది.