మూడు రాజధానుల ప్రకటన..రాష్ట్రంలో పండుగ వాతావరణం | Gudivada Amarnath Comments On AP Three Capitals | Sakshi
Sakshi News home page

మూడు రాజధానుల ప్రకటన..రాష్ట్రంలో పండుగ వాతావరణం

Published Thu, Dec 19 2019 4:05 AM | Last Updated on Thu, Dec 19 2019 4:05 AM

Gudivada Amarnath Comments On AP Three Capitals - Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండటం మంచిదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు వీలుందని అసెంబ్లీలో సీఎం ప్రకటించిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులే కాకుండా అమరావతి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. అన్ని విధాల అనుకూలమైన విశాఖ నగరాన్ని అడ్మినిస్ట్రేటివ్‌ రాజధానిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన సందర్భంలో మరోసారి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఙతలు తెలుపుతున్నానని చెప్పారు. చంద్రబాబు కేవలం వారి వర్గానికి, వారి పార్టీ నేతలకే ఉపయోగపడాలన్న కోణంలోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని అమరనాథ్‌ ధ్వజమెత్తారు.  

తొమ్మిది నగరాల అభివృద్ధి ఏమైంది...: 2014 ఆగస్టు 15న కర్నూలులో చంద్రబాబు 9 నగరాల అభివృద్ధి గురించి చేసిన ప్రకటన ఐదేళ్లు ఎందుకు మరిచిపోయారని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయి రాజధానిగా ప్రచారం చేసుకున్న అమరావతిలోనైనా కనీసం 9 భవనాలు ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. కేవలం కోర్‌ క్యాపిటల్‌ కోసం 55 వేల ఎకరాలు సేకరించి నిర్మాణానికి దాదాపు రూ. లక్ష ఆరు వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు చెప్పారన్నారు. రాజధానికే అంత ఖర్చు చేస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయగలమన్నారు. అందుకే సీఎం జగన్‌ అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి వెల్లడించిన మూడు రాజధానుల ఆలోచనకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని అమర్‌నాథ్‌ చెప్పారు.

ఉత్తరాంధ్రకు వర ప్రదాయిని 
పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు  
వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వరప్రదాయినిగా మారుతుందని వైఎస్సార్‌సీపీ పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజధానిపై అధ్యయనం కోసం వేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దక్షిణాఫ్రికా మాదిరిగా మూడు రాజధానులు ఉండాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అభిప్రాయపడితే చంద్రబాబు నిన్నటి నుంచీ ఫక్తు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలాగా గొంతు చించుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement