కేంద్రం వద్ద ప్రయాణికులు (ఇన్‌సెట్‌లో) ఖాళీగా ఉన్న విచారణ కేంద్రం
ఇతని పేరు పంకజ్. మహారాష్ట్ర వాసి. ఆదివారం తను వెళ్లాల్సిన రైలు సమయానికి రాలేదు. అతనికి తెలుగు రాదు. సమాచార కేంద్రంలో ఎవరూ లేకపోవడంతో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ సమాధానం తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గూడూరు: భారీ వర్షాలు ఓ పక్క.. మరో పక్క రైల్వే ట్రాక్ పనులు, సిగ్నె ల్స్ మరమ్మతులు తదితర కారణాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతోంది. ఈ సమయంలో రైళ్లు ఏ సమయానికి వస్తాయనే సమాచారం చెప్పేందుకు విచారణ కేంద్రంలో ఎవరూ లేక ప్రయాణికులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఎవరిని అడిగినా సమాధానం సక్రమంగా రాకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
గూడూరు రైల్వేస్టేషన్‌లో ఉన్న విచారణ కేంద్రంలో ఆదివారం ఒకటన్నర గంటలపాటు ఎవరూ లేకపోవడంతో ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందలేదు. ప్రస్తుతం నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతోంది. గూడూరు జంక్షన్ కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు ఈ స్టేషన్ కేంద్రం రాకపోకలు సాగిస్తున్నారు. అ లాగే దసరా పండుగకు ఊళ్లకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు రైళ్లపై ఆధారపడ్డారు. దీంతో రైల్వేస్టేషన్లు ప్ర యాణికులతో కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో విచారణ కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ఏం చేయాలో తెలియని ప్రయాణికులు టికెట్లు ఇచ్చే వారి వద్దకెళ్లి తాము వెళ్లాల్సిన రైలు ఎప్పుడొస్తుందని ఆరాతీశారు. వారు పక్కనున్న విచారణ కేంద్రంలో అడగండని కొందరికి, ఇంకొందరికి తెలియదని చెప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలియకపోవడంతో కొందరు బస్సులపై ఆధారపడ్డారు.
ఆలస్యంగా..
ఆదివారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. బిలాస్‌పూర్ నుంచి తిరుపతికి వచ్చే బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకు గూడూరు రైల్వే జంక్షన్‌కు రావాల్సి ఉండగా, అది 2.30 గంటల ఆలస్యంగా 4.30 గంటలకు చేరుకుంది. అదే విధంగా మధ్యాహ్నం 1.45 రావాల్సిన నవజీవన్ కూడా సాయంత్రం 4.45 వరకు రాలేదు. అదే విధంగా పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.
సమాధానం చెప్పేవారేరీ
విచారణ కేంద్రంలో గంటన్నరపాటు ఏ రైలు ఎప్పుడొస్తుందో చెప్పే వారులేక, విషయం తెలియక తీవ్ర ఇబ్బంది పడ్డాం. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? ఇలాంటివారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. – నారాయణ, ప్రయాణికుడు
బంధువులు మరణించారని వెళ్లారు
విచారణ కేంద్రంలో పనిచేసే వ్యక్తి బంధువులు ఎవరో చనిపోయారని వెళ్లాడు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సిబ్బందిని ఏర్పాటుచేశాం.– వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి స్టేషన్ మాస్టర్