కుటుంబ సభ్యులతో సతీష్‌రెడ్డి
నెల్లూరు సీమలో సాధారణ రైతు బిడ్డగా పుట్టారు. భారతదేశానికి అత్యంత కీలకమైన రక్షణ రంగంలో శిఖరం అయ్యారు. చిరుప్రాయం నుంచే చురుకైన వాడిగా అందరిలో గుర్తింపు పొందిన గుండ్రా సతీష్‌రెడ్డి.. ఇప్పుడు భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగాడు. భారతదేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ చైర్మన్‌గా నియమితులై శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింహపురి వాసులు ఆనందడోలికల్లో మునిగిపోయారు.ఈ కీలక బాధ్యతలకు సంబంధించి శనివారం ఆదేశాలు వెలువడిన సమయంలో ఆయన నెల్లూరు నగరంలోనే ఉన్నారు. ఆయన్ను కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు అభినందనలతో ముంచెత్తారు.
ఆత్మకూరురూరల్: భారతదేశ రక్షణ రంగంలో కీలక పదవిని అధిరోహించారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ, జాతీయ అవార్డులు ఆయన్ను వరించాయి. భారత రక్షణశాఖ క్షిపణిరంగ పరిశోధకుడిగా ఎన్నో విజయాలను సాధించి పెట్టారు. అంతర్జాతీయ సాంకేతిక రంగ నిపుణుల మన్ననలు పొందారు. ఎంత ఉన్నతికి ఎదిగినా జన్మభూమిపై మమకారాన్ని వదులుకోలేదు. స్వగ్రామాన్ని దత్తత తీసుకుని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆయనే ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన గుండ్రా సతీష్‌రెడ్డి. డీఆర్‌డీఓ చైర్మన్‌గా నియమితులైనట్టు తెలియడంతో శనివారం ఆయన స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి. తమ మధ్యే తిరుగుతూ ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడంపై ఆ గ్రామంలోని ఆయన బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, గ్రామస్తులు సంతోషంతో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సతీష్‌రెడ్డి చదివిన ఉన్నత పాఠశాలలో స్థానిక నేత నిజమాల నరసింహులు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీట్లు పంచి సతీష్‌రెడ్డి జీవిత ప్రస్థానాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి వివరించారు. పలువురు గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ తమ గ్రామానికి సతీష్‌రెడ్డి ద్వారా దక్కిన గౌరవానికి గర్వపడుతున్నామన్నారు.
జన్మభూమిపై మమకారం
అంతర్జాతీయ స్థాయిలో ధృవతారగా వెలుగొందుతున్న జన్మభూమిపై మమకారం తగ్గకుండా స్వగ్రామమైన ఆత్మకూరు మండలం మహిమలూరును దత్తత తీసుకుని పలు రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. భార్య పద్మావతి, తనకన్నా పెద్దవాడైన సోదరుడు గుండ్రా శ్రీనివాసులురెడ్డి నిరంతర సహకారంతో తన స్వగ్రామం మహిమలూరులో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు సతీష్‌రెడ్డి పాటు పడుతున్నారు. తన వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే తల్లి రంగమ్మ ఆరోగ్య, యోగక్షేమాలను అనునిత్యం డాక్టర్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం మరిచిపోరు. సోదరుడు శ్రీనివాసులురెడ్డి, సేవా దృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తులతో తన గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు సాధించడం వంటి కార్యక్రమాలతో సతీష్‌రెడ్డి కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment