సుద్ద ముక్కలూ కరువే! | Guntur Government Schools Shortage With Stationery | Sakshi
Sakshi News home page

సుద్ద ముక్కలూ కరువే!

Published Mon, Jul 30 2018 1:47 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Guntur Government Schools Shortage With Stationery - Sakshi

బోర్డుపై రాస్తున్న ఉపాధ్యాయురాలు

తాడేపల్లిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి కోట్లు ఖర్చు పెడుతున్నా పాఠశాలల నిర్వహణ, కొనుగోళ్లకు 2006లో ఇచ్చే గ్రాంటులనే నేటికీ ఇస్తోంది. అవి కూడా దారి మళ్లడంతో సుద్దముక్కలు, రిజిస్టర్లు, కాగితాలు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులే తమ వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజధాని జిల్లాల్లో 8 వేల పాఠశాలలు :కృష్ణా, గుంటూరు జిలాల్లో మొత్తం ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలకు ప్రభుత్వం గ్రాంటు నిధులు ఇస్తుంది. వాటిలో స్కూలు గ్రాంటు కింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.7వేలు ఇస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీసులు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్‌లు, కాగితాలు తదితరవాటిని కొనడానికి వినియోగిస్తారు. పాఠశాలల నిర్వహణ కోసం రూ.10వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ నిధులతో మరుగుదొడ్ల రిపేర్లు, కుర్చీల మరమ్మతులు, నీటిపైపుల సమస్యలకు వినియోగిస్తారు. ఇదే మొత్తం 2006వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. అప్పట్లో ఉన్న ధరలకు ఆ నిధులు సరిపోయేవి. ప్రస్తుతం అవి ఏమాత్రం చాలడం లేదని  హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు. గ్రాంటును పెం చాలని హెచ్‌ఎంలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు.

గతేడాది దారి మళ్లిన గ్రాంటు నిధులు : విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి ఆగస్టు లోపు గ్రాంటు నిధులు ప్రభుత్వం ఇవ్వాలి. కానీ గతేడాది కొన్ని పాఠశాలలకు సెప్టెంబర్‌లో, మరి కొన్నింటికి అక్టోబర్‌లో ఇచ్చారు. అయితే ఆ గ్రాంటు నిధులను ఎలా వినియోగించాలో అనే దానిలో సర్వశిక్ష అభియాన్‌ అధికారులు  తమ సొంత నిర్ణయాలతో ఎంఈవోలకు ఉత్తర్వులు జారీచేశారు. స్కూలు అవసరాలకు ఇచ్చే గ్రాంటును గ్యాస్‌ డబుల్‌ సిలిండర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాథమిక పాఠశాల వారు తమకొచ్చిన రూ.5వేలతో వాటిని కొన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారు కొనగా రూ.2వేలు మిగిలింది. దీనికితోడు స్కూలు నిర్వహణకు ఇచ్చిన గ్రాంటు నిధులు రూ.10వేలు మరుగుదొడ్ల పరిశుభ్రతలో పాల్గొనే సిబ్బందికి (స్కావెంజర్లకు) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.2,500లు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.4వేలు ఇవ్వాలి. నిర్వహణ గ్రాంటు నిధులు వారికి వేతనాలుగా ఇచ్చేశారు.

హెచ్‌ఎంలదే బాధ్యత : గ్రాంటు నిధులు దారి మళ్లడంతో పాఠశాలల్లో సుద్దముక్కలు కొనాలన్నా, రిజిస్టర్లు కొనాలన్నా, ఏమైనా మరమ్మతులు చేయించాలన్నా, చీపుర్లు కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబు నుంచే పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆదర్శ, పురపాలక, ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఈ సంఘాల నుంచి స్కావెంజర్లుగా రెండు జిల్లాల్లో 4,500మంది పనిచేస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరానికి ఎనిమిది వేల పాఠశాలలకు గాను ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించారని సమాచారం. ప్రస్తుత సంవత్సరం ఇంకా నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాలల్లో స్కావెం జర్లకు, చాక్‌పీస్‌లు, రిజిస్టర్లకు ఉపాధ్యాయులు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రాంటు వ్యవహారంపై విద్యాశాఖ ఆర్జేడీ, డీఈవోలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

సమన్వయ లోపం
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా 2015 అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నుంచి ఈ నిధులు కేటాయించారు. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.2వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేవారికి రూ.2,500లు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి డీఆర్‌డీఏ శాఖ వేతనాలు ఇచ్చేవారు. ఈ విద్యా సంవత్సరం వేతనాలను డీఆర్‌డీఏ ఆపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్‌డీఏ, విద్యాశాఖ మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెబుతున్నాయి. దీంతో స్కావెంజర్లు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పాఠశాలల్లో అవసరమైన చాక్‌పీస్‌లు కొనేందుకు కూడా నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఒక్కొక్క పాఠశాలకు 3 నుంచి 5 చాక్‌పీస్‌ బాక్స్‌లు అవుతాయని, ఒక్కొక్క చాక్‌పీస్‌ బాక్స్‌ ఖరీదు రూ.10లు ఉంటుందని, నెలకు రూ.1500ల వరకు ఖర్చవుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement