సాక్షి, గుంటూరు: ఆకాశ రామన్న ఉత్తరంతో తీగ లాగితే డొంక కదిలింది. టీడీపీ హయాంలో అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
జరిగిందిలా...
మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన చిమటా కోటేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ మహిళతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కలసి సహ జీవనం కొనసాగించారు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలించుకోవాలని కోటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. మహిళను హత మార్చేందుకు ముందుగా మంగళగిరి మండలం టీడీపీ అధ్యక్షుడు అభయం తీసుకున్నాడు. దీంతో టీడీపీ మండల అధ్యక్షుడు ఈ విషయంపై డీఎస్పీతో ముందుగా ఒప్పందం కుదిర్చాడు. మహిళను హత్య చేసినా కేసు కాకుండా ఉండేందుకు రూ.10 లక్షలు కోటేశ్వరరావు ఇచ్చేలా మాట్లాడాడు. దీంతో 2017లో కోటేశ్వరరావు సదరు మహిళను రేపల్లె సమీపంలోని నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్ళి హత మార్చి శవం కనపడకుండా చేశాడు. మహిళ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 336/2017 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. హత్య అనంతరం టీడీపీ మండల అద్యక్షుడు సహకారంతో డీఎస్పీ రామాంజనేయులుకు కోటేశ్వరరావు రూ.10 లక్షలు ఇచ్చాడు.
వెలుగు చూసిందిలా...
గతేడాది నవంబరులో కోటేశ్వరరావు మహిళను హత మార్చాడనే వివరాలతో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ఆకాశరామన్న పేరుతో ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గతేడాది నవంబరు 21వ తేదీన “మంగళగిరిలో మహిళ హత్య?’ పేరుతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ రామాంజనేయులును అదే రోజున డీజీపీ కార్యాలయానికి పిలిపించి ప్రాథమికంగా విచారించారు. అయితే తనకేమీ సంబంధ లేదని చెప్పడంతో శాఖాపరమైన విచారణకు డీజీపీ ఆదేశించారు. విచారణలో నిందితుడి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకొని హత్యను మిస్సింగ్ కేసుగానే వదిలేసినట్లు తేలింది. సీరియస్‌గా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ తన కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేశారు.
అక్రమ ఆస్తులను వెలికితీయాలి
కృష్ణా జిల్లాకు చెందిన డీఎస్పీ రామాంజనేయులు సామాన్య కుటుంబంలో పుట్టారు. ప్రస్తుతం ఆయన కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఎస్‌ఐగా పోలీస్ శాఖలో చేరిన ఆయన గుంటూరు అర్బన్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వరకు పని చేశారు. ఈ క్రమంలో అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో చిన్నబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో రెండు సార్లు ఆయన్ను నార్త్ జోన్ డీఎస్పీ నుంచి తొలగించినా మళ్లీ రాత్రికి రాత్రే జీవోలను తెచ్చి అక్కడే పోస్టింగ్ పొందాడు. అతని కుటుంబ సభ్యులతోపాటు బినామీల పేర్లతో కోట్ల రూపాయల విలువచేసే అక్రమ ఆస్తులు కూడగట్టాడని సమాచారం. హత్య కేసును కూడా మాఫీ చేసేందుకు యతి్నంచిన డీఎస్పీ పని తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు'
Published Sat, Jan 11 2020 8:32 AM | Last Updated on Sat, Jan 11 2020 8:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment