గుంటూరు ఏసీ కళాశాల సమీపంలో వాహనాలను స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం జిల్లాలోని 5,500 మంది పోలీసులు, 15 వేల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బంది, 23 వేల మందికి పైగా గ్రామ, వార్డు వలంటీర్లు, 8 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బంది... రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు.
గుంటూరు నగరంలో పాజిటివ్ కేసులు 120 దాటాయి. పోలీసులు లాక్ డౌన్ కఠినతరంగా అమలు చేస్తున్నారు. అయినా యువకులు, కొందరు వ్యక్తులు ఇంట్లో బోర్ కొడుతోందని కాలక్షేపం కోసం రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో యువకులు బైక్‌పై డబుల్, త్రిబుల్స్ కూర్చుని షికార్లు కొడుతున్నారు. బయటికి ఎందుకొచ్చావ్ అని పోలీసులు ప్రశ్నిస్తే జేబులోంచి డాక్టర్ రాసిన ఓ ప్రిస్క్రిప్షన్ పేపర్ చూపి మందుల కోసం వచ్చామని బుకాయిస్తున్నారు.
మాస్క్‌లు ధరించకుండా....
మాస్క్‌లు ధరించకుండా వీధుల్లో గుంపులు గుంపులుగా చేరి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట ఒకటో లైన్, రామిరెడ్డితో, అల్లినగర్, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్, వాగు, రైల్వే స్టేషన్ రోడ్డు, పొత్తులవారీపేట, బారాహిమామ్ పంజా సెంటర్, సుద్దపల్లిడొంక, సుగాలి కాలనీ, ఎన్‌జీవో కాలనీ సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం, మధ్యాహ్నం సమయంలో గుమికూడటం సర్వసాధారణంగా మారుతోంది. తెనాలి, నరసరావుపేట, పొన్నూరు, మంగళగిరి, చిలకలూరిపేట సహా జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. వీధుల్లో జనాలు ఎక్కువగా గుమికూడుతున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.
భారీగా వాహనాలు సీజ్...
♦ గుంటూరు అర్బన్‌లో ఇప్పటి వరకూ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి 3, 971 వాహనాలు సీజ్ చేశారు. గుంటూరు నగరంలో సీజ్ చేసిన వాహనాలతో పోలీస్ పరేడ్ గ్రౌండ్ పేరుకుపోతోంది. కేసులు పెడుతున్నా, వాహనాల సీజ్ చేస్తున్నా జనంలో మాత్రం మార్పు రాకపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
స్వీయ నియంత్రణే మేలు...
♦ ప్రస్తుతం జిల్లాలో నమోదైన, నమోదవుతున్న కాంటాక్ట్ కేసుల్లో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకూ లేవు. వైరస్ సోకిన వ్యక్తిని విచారించి అతను ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడో తెలుసుకుని, ఆ వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాక పాజిటివ్ అని తెలుస్తోంది. పోలీసులు, అధికారులు గుర్తించే లోపే వీళ్లు చాలా మందిని కలుస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. లేకపోతే ప్రమాదమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ ఇంట్లో ఉండటం, స్వీయ జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment