ఎయిడ్స్ రోగులు 'ఆ రెండు చోట్లే' టాప్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏయిడ్స్ రోగులు అత్యధికంగా గల జిల్లాల జాబితాలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎయిడ్స్ రోగుల అత్యధికంగా గల జిల్లాల జాబితా వివరాలను విడుదల చేసింది. 2013 -14 ఏడాదిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 5,195 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా వారిలో 2,498 మహిళలు ఉన్నారని పేర్కొంది.
అంతకు ముందు ఏడాది 6,027 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, హైదరాబాద్, విశాఖపట్నం జిల్లా, చిత్తూరు జిల్లా, నల్గొండ జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, కర్నూలు జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా , విజయనగరం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అక్రమించాయని తెలిపింది. అయితే తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు జాతీయ రహదారికి అనుకుని ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది.
విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లు వరుసగా గుంటూరు జిల్లా ఎయిడ్స్ రోగులతో మొదటి స్థానంలో ఉందన్న సంగతిని ఈ సందర్బంగా సొసైటీ గుర్తు చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఎయిడ్స్ రోగుల్లో జాబితాలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. నగరంలో మొత్తం 3952 మంది హెచ్ఐవీ రోగులు ఉండగా వారిలో 2,525 మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. కాగా అత్యధికంగా గర్బిణీల ఎయిడ్స్ వ్యాధీ సోకిన జిల్లాగా మహబూబ్నగర్ నమోదు అయినట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది.