HIV positive cases
-
దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ
కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థి కర్నూలు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఎలా జరిగిందని ఆరా తీయగా.. మొబైల్‌యాప్‌లో ఓ మహిళ ఫోన్ నంబర్ సేకరించి ఆ విద్యార్థిని పిలిపించుకుని శారీరకంగా కలిసిన విషయం వెలుగు చూసింది. తనకు పాజిటివ్ అని తేలగానే బెంగ పెట్టుకుని చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. రాయదుర్గానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరం, కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినపుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు బయటపడింది. తండ్రి తప్పిదాల కారణంగా తల్లికి.. ఆ తర్వాత విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. రాయదుర్గం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆటోను వదిలి జీపు డ్రైవర్‌గా చేరాడు. బయటి ప్రాంతాలకు వెళ్లినపుడు మద్యం మత్తులో పెడదారి పట్టాడు. చివరకు హెచ్ఐవీ బారినపడి కుంగిపోతున్నాడు. డీ హీరేహాళ్ మండలానికి చెందిన 22 ఏళ్ల హిజ్రాకు హెచ్ఐవీ సోకింది. హిజ్రాతో లైంగిక సంపర్కం కలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా వీరే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తుండటం కలవరం రేపుతోంది. రాయదుర్గం (అనంతపురం జిల్లా): అరక్షిత శృంగారం ప్రాణాంతక హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు దారితీస్తోంది. భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరకంగా కలవడం, సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది దీనిబారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కబళిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. డిన్నర్ల పేరుతో రాత్రిళ్లు రోడ్ల మీద తీరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆకర్షణతో పెడదారిన పట్టడం వెరసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ప్రతి నెలా 90 పాజిటివ్ కేసులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఏఆర్టీ, మొబైల్ నెట్వర్క్, నర్సింగ్ హోమ్ తదితర కేంద్రాల్లో నిర్వíహిస్తున్న హెచ్ఐవీ పరీక్షల్లో ప్రతి నెలా 80 నుంచి 90 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన డీ హీరేహాళ్, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండతో పాటు అనంతపురం తదితర ప్రాంతాల్లో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ట్రాన్స్జెండర్స్లోనూ హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో 14,718 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా చికిత్సలందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. హెచ్ఐవీ నిర్ధారణ జరిగినా కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం, చికిత్సకు వెళ్లకుండా బయట మందులు వాడడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉన్నత చదువుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు కొందరు ఈ మహమ్మారి వలలో చిక్కుకోవడం దురదృష్టకరం. కండోమ్ వినియోగిస్తే హెచ్ఐవీ వైరస్ బారినపడరని తెలిసినా మత్తు, వ్యామోహంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఇకనైనా మేల్కొని వివాహేతర సంబంధాలు, అరక్షిత లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం నాశనం చేసుకోవద్దు యువత అనాలోచిత నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇటీవల కొంతమంది యువకుల్లో హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం కాస్త ఆందోళనకర విషయమే. అయినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంది. పాజిటివ్ ఉన్నవారు దాచిపెట్టడం మాని చికిత్స తీసుకుంటే మంచిది. – కె.సత్యనారాయణ, ఏఆర్టీ వైద్యులు, అనంతపురం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులు ఒకరో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడితే ఏమో అనుకోవచ్చు.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ వ్యాధి బారినపడటం విచారకరం. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, బయట తిరుగుళ్లు తిరిగే యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తుండాలి. హెచ్ఐవీ వైరస్ ఒకసారి ప్రవేశించాక జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ఇంకెక్కడా మందులు లభించవు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స పొందుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక చర్యలకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. – డాక్టర్ అనుపమ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, అనంతపురం -
మృత్యు ఘోష!
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్‌సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్ (ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా మందులకు రాలేకపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
ఆ కారణంతో జాబ్‌లోంచి తీసేశారు..
పుణె : హెచ్ఐవీ గురించి ఎన్నో కోట్లు పెట్టి ప్రచారాలు, వాణిజ్య ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. హెచ్ఐవీ సోకిందని ఓ వ్యక్తిని దూరంపెట్టకూడదని పదేపదే చూపిస్తున్నారు. కానీ ఇదే కారణాన్ని చూపుతూ ఓ మహిళను ఉద్యోగంలోంచి తీసేసింది ఓ సంస్థ. అయితే ఈ సంఘటన 2015లో జరిగింది. పుణెకు చెందిన మహిళ.. తన అవసరాల కోసం మెడికల్ క్లెయిమ్‌కు తాను పనిచేస్తున్న కంపెనీకి దరఖాస్తు చేసుకోగా.. అందులో తనకు హెచ్ఐవీ ఉందని తేలింది. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఆమెను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేసింది. అయితే ఈ వ్యాధి తనకు తన భర్త వల్ల వచ్చిందని, తన భర్త కూడా మరణించాడని, ఇంట్లో వారు కూడా దగ్గరకు రానివ్వడంలేదని, తనకు ఉద్యోగం అవసరమని వాపోయింది. అయినా కంపెనీ యజమానులు వినిపించుకోకుండా.. రాజీనామా చేయాల్సిందే అని ఒత్తిడి చేశారు. అయితే దీనిపై కోర్టులో కేసు వేసిన ఆ మహిళకు మూడేళ్ల తరువాత న్యాయం జరిగింది. హెచ్ఐవీ ఉందన్న కారణంతో ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం సరికాదని.. సదరు కంపెనీపై న్యాయస్థానం మండిపడింది. మళ్లీ తనను ఎప్పటిలాగే ఉద్యోగంలో చేర్చుకోవాలని, ఈ మూడేళ్ల జీతభత్యాలు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. -
ఆ జైలులో ఖైదీలకు హెచ్ఐవీ..!
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు. వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
ఎయిడ్స్ రోగులు 'ఆ రెండు చోట్లే' టాప్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏయిడ్స్ రోగులు అత్యధికంగా గల జిల్లాల జాబితాలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎయిడ్స్ రోగుల అత్యధికంగా గల జిల్లాల జాబితా వివరాలను విడుదల చేసింది. 2013 -14 ఏడాదిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 5,195 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా వారిలో 2,498 మహిళలు ఉన్నారని పేర్కొంది. అంతకు ముందు ఏడాది 6,027 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, హైదరాబాద్, విశాఖపట్నం జిల్లా, చిత్తూరు జిల్లా, నల్గొండ జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, కర్నూలు జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా , విజయనగరం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అక్రమించాయని తెలిపింది. అయితే తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు జాతీయ రహదారికి అనుకుని ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లు వరుసగా గుంటూరు జిల్లా ఎయిడ్స్ రోగులతో మొదటి స్థానంలో ఉందన్న సంగతిని ఈ సందర్బంగా సొసైటీ గుర్తు చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఎయిడ్స్ రోగుల్లో జాబితాలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. నగరంలో మొత్తం 3952 మంది హెచ్ఐవీ రోగులు ఉండగా వారిలో 2,525 మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. కాగా అత్యధికంగా గర్బిణీల ఎయిడ్స్ వ్యాధీ సోకిన జిల్లాగా మహబూబ్‌నగర్ నమోదు అయినట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది.