కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థి కర్నూలు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఎలా జరిగిందని ఆరా తీయగా.. మొబైల్‌యాప్‌లో ఓ మహిళ ఫోన్ నంబర్ సేకరించి ఆ విద్యార్థిని పిలిపించుకుని శారీరకంగా కలిసిన విషయం వెలుగు చూసింది. తనకు పాజిటివ్ అని తేలగానే బెంగ పెట్టుకుని చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యాడు.
రాయదుర్గానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరం, కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినపుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు బయటపడింది. తండ్రి తప్పిదాల కారణంగా తల్లికి.. ఆ తర్వాత విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది.
రాయదుర్గం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆటోను వదిలి జీపు డ్రైవర్‌గా చేరాడు. బయటి ప్రాంతాలకు వెళ్లినపుడు మద్యం మత్తులో పెడదారి పట్టాడు. చివరకు హెచ్‌ఐవీ బారినపడి కుంగిపోతున్నాడు.
డీ హీరేహాళ్ మండలానికి చెందిన 22 ఏళ్ల హిజ్రాకు హెచ్‌ఐవీ సోకింది. హిజ్రాతో లైంగిక సంపర్కం కలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా వీరే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తుండటం కలవరం రేపుతోంది.
రాయదుర్గం (అనంతపురం జిల్లా): అరక్షిత శృంగారం ప్రాణాంతక హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌కు దారితీస్తోంది. భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరకంగా కలవడం, సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది దీనిబారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కబళిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. డిన్నర్ల పేరుతో రాత్రిళ్లు రోడ్ల మీద తీరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆకర్షణతో పెడదారిన పట్టడం వెరసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
ప్రతి నెలా 90 పాజిటివ్ కేసులు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఏఆర్‌టీ, మొబైల్ నెట్‌వర్క్, నర్సింగ్ హోమ్ తదితర కేంద్రాల్లో నిర్వíహిస్తున్న హెచ్‌ఐవీ పరీక్షల్లో ప్రతి నెలా 80 నుంచి 90 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన డీ హీరేహాళ్, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండతో పాటు అనంతపురం తదితర ప్రాంతాల్లో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ట్రాన్స్‌జెండర్స్‌లోనూ హెచ్‌ఐవీ కేసులు బయటపడుతున్నాయి.
జిల్లాలో 14,718 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా చికిత్సలందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. హెచ్‌ఐవీ నిర్ధారణ జరిగినా కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం, చికిత్సకు వెళ్లకుండా బయట మందులు వాడడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉన్నత చదువుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు కొందరు ఈ మహమ్మారి వలలో చిక్కుకోవడం దురదృష్టకరం. కండోమ్ వినియోగిస్తే హెచ్‌ఐవీ వైరస్ బారినపడరని తెలిసినా మత్తు, వ్యామోహంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఇకనైనా మేల్కొని వివాహేతర సంబంధాలు, అరక్షిత లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీవితం నాశనం చేసుకోవద్దు
యువత అనాలోచిత నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇటీవల కొంతమంది యువకుల్లో హెచ్‌ఐవీ లక్షణాలు కనిపించడం కాస్త ఆందోళనకర విషయమే. అయినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంది. పాజిటివ్ ఉన్నవారు దాచిపెట్టడం మాని చికిత్స తీసుకుంటే మంచిది.
– కె.సత్యనారాయణ, ఏఆర్టీ వైద్యులు, అనంతపురం
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులు ఒకరో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడితే ఏమో అనుకోవచ్చు.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ వ్యాధి బారినపడటం విచారకరం. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, బయట తిరుగుళ్లు తిరిగే యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తుండాలి. హెచ్‌ఐవీ వైరస్ ఒకసారి ప్రవేశించాక జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ఇంకెక్కడా మందులు లభించవు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స పొందుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక చర్యలకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలి.
– డాక్టర్ అనుపమ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment