మహిళా విద్యకు చిరునామా | Guntur Womens College Special Story | Sakshi
Sakshi News home page

మహిళా విద్యకు చిరునామా

Published Tue, Jun 4 2019 12:57 PM | Last Updated on Tue, Jun 4 2019 12:57 PM

Guntur Womens College Special Story - Sakshi

ప్రభుత్వ మహిళా కళాశాల ప్రవేశ ద్వారం

గుంటూరు ఎడ్యుకేషన్‌: మహిళలు విద్యావంతులైతే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంక్షించిన మహానీయుల ఆశయాలకు సాక్ష్యంగా గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భాసిల్లుతోంది. బ్రిటీషు వారి హయాంలో స్థాపించిన ఈ సరస్వతీ నిలయం ఏడున్నర దశాబ్దాల చరిత్ర సొంతం చేసుకుని మహిళాభివృద్ధి లక్ష్యంగా ప్రగతి పథంలో పురోగమిస్తోంది. డిగ్రీ, పీజీ కోర్సులతో విద్యార్థినులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ జిల్లాకే మణిహారంగా నిలిచింది. బ్రిటీషు పాలకుల ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి సాక్షిగా నిలిచి, చెక్కు చెదరని భవన నిర్మాణాలతో వర్థిల్లుతున్న కళాశాల గతంలో నాక్‌ నుంచి ‘ఏ’ గ్రేడ్‌ పొందగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదాతో కొనసాగుతోంది. 1942లో బ్రిటీషు వారి పాలనలో స్థాపించిన కళాశాల విలువలతో కూడిన విద్యా విధానంతో, ప్రైవేటు రంగానికి దీటుగా ప్రగతిపథంలో దూసుకెళుతూ రాష్ట్రంలోని అతికొద్ది ప్రభుత్వ కళాశాలల్లో ఒకటిగా నిలిచింది. ప్రత్యేకించి కోస్తాంధ్రలో పురాతన చరిత్ర గల ఏకైక మహిళా విద్యాసంస్థగా ప్రసిద్ధి చెందిన కళాశాలగా ప్రగతి పథంలో పయనిస్తోంది. గుంటూరు నగరంలోని సాంబశివపేటలో 16 ఎకరాల సువిశాల స్థలంలో స్థాపించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాణ్యమైన విద్యకు నిలయంగా భాసిల్లుతోంది. ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, రీడింగ్‌ రూం, జవహర్‌ విజ్ఞాన కేంద్రం (జేకేసీ) వంటి పూర్తిస్థాయి వసతులతో పాటు సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ కాలానుగుణమైన కోర్సులతో ముందుకెళుతోంది.  యూజీ స్థాయిలో 24, నాలుగు పీజీ కోర్సులతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ లేబరేటరీల ద్వారా విద్యార్థినులకు ప్రయోగాత్మక విద్యను అందిస్తోంది.

అటానమస్‌తో స్వతంత్ర హోదా...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో ఒకటిగా ఉన్న మహిళా కళాశాల అభివృద్ధికి యూజీసీ ఇచ్చిన స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదా ఊతం ఇచ్చింది. 2014–15 విద్యాసంవత్సరం నుంచి స్వతంత్రంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని, పరీక్షలను సైతం తానే నిర్వహిస్తోంది. తద్వారా యూజీసీ ద్వారా నేరుగా నిధులు పొంది, కళాశాలలో నూతన భవన నిర్మాణం, ప్రయోగశాలలు, విద్యార్థినులకు ఉపాధి కల్పించేందుకు కాలానుగుణంగా కోర్సుల రూపకల్పన అంతా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం చేతుల్లోనే ఉంటుంది. ఆధునిక విద్యను అందించేందుకు కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం యూజీసీ స్థానంలో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్చితార్‌ శిక్షా అభియాన్‌ (రూసా) నిధులు మంజూరు చేస్తోంది.

నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్య
అటానమస్‌ హోదా పొందిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఫీజులను స్వయంగా నిర్ణయించుకునే అధికారం ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం అమలుపరిచే ఫీజులనే వసూలు చేసేందుకు నిర్ణయించారు. సాధారణ బీఏ, బీకాం కోర్సులకు రూ.1151 స్పెషల్‌ బీఏ కోర్సుకు రూ.2171, బీకాం (కంప్యూటర్స్‌)కు రూ.4151, బీఎస్సీ కోర్సుకు రూ.1276, బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులకు రూ.4276 చొప్పున ఫీజులను నిర్ణయించారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్‌ ఫీజు కింద ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. కళాశాలకు అనుబంధంగా ఉన్న జవహర్‌ విజ్ఞాన కేంద్రం (జేకేసీ) విద్యార్థినుల్లో భాషా, భావ వ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. డిగ్రీ విద్యతో పాటు జేకేసీ శిక్షణ పొందిన విద్యార్థినులకు ప్రతి ఏటా వివిధ కార్పొరేట్‌ సంస్థలతో క్యాంపస్‌ ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

కాలాను గుణమైన కోర్సులు
కాలానుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టడంలో కళాశాల ముందంజలో ఉంటోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూజీ స్థాయిలో కొత్తగా బీఏలో హిస్టరీ, పాలిటిక్స్, ఇంగ్లిష్‌ ఫర్‌ డిజిటల్‌ ఏజ్‌ కలయికతో ఇంగ్లిష్‌ మీడియం, హిస్టరీ పాలిటిక్స్, ఫంక్షనల్‌ తెలుగు కోర్సును తెలుగు మీడియంలో ప్రవేశపెట్టారు. బీకాంలో బ్యాంకింగ్, ఇన్సూ్యరెన్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సు, బీఎస్సీలో కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ కోర్సు, మ్యాథ్స్, కంప్యూటర్స్, మల్టీమీడియా కోర్సు, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోర్సు, మ్యాథ్స్, కంప్యూటర్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సు అందుబాటులోకి తెచ్చారు.

ఏడాదికి రెండు సెమిస్టర్‌ల విధానం
స్వయం ప్రతిపత్తి హోదా పొందిన కళాశాలలో ఏడాదికి రెండు సెమిస్టర్‌ల విధానం అమలు పరుస్తున్నారు. కళాశాలలో రెండువేల మంది విద్యార్థినులు చదువుతుండగా, సబ్జెక్టుల బోధనకు 85 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుతూనే విద్యార్థినులు ఉపాధిని చూపే యాడ్‌ ఆన్‌ కోర్సులను సైతం నేర్చుకునే అవకాశం ఉంది. యూజీసీ ద్వారా> మూడేళ్ల కాల పరిమితిలో ఫొటోషాప్, వెబ్‌ డిజైనింగ్‌ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టంతో విద్యార్థినులు తమకు నచ్చిన వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవచ్చు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే విద్యార్థినులకు కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో వసతి సదుపాయం ఉండగా, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనం పొందే వీలుంది.

ఈనెల 24, 25 తేదీల్లో నాక్‌ బృంద సందర్శన
ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్‌ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపారు. కళాశాలలో విద్యాబోధన, మౌలిక వసతులు, ప్రయోగశాలలు, నైపుణ్యాల పెంపుదలకు చేపడుతున్న చర్యలు, ఉద్యోగావకాశాల కల్పన, అధ్యాపకుల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని నాక్‌ కళాశాలలకు గ్రేడ్లు ఇస్తుంది. గతంలో 2011–2016 మధ్య కాలంలో నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ గుర్తింపు సాధించిన మహిళా కళాశాల మరోసారి నాక్‌ గుర్తింపు కోసం పంపిన ప్రతిపాదనలపై ఈనెల 24,25 తేదీల్లో నాక్‌ బృందం కళాశాలకు రానుంది. ఈ నేపథ్యంలో కళాశాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పుల్లారెడ్డి, అధ్యాపకులు నిమగ్నమయ్యారు.

విద్యార్థినుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
ఘన చరిత్ర కలిగిన మహిళా కళాశాలలో అందిస్తున్న విద్యాబోధన విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేదిగా ఉంటోంది. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ శిక్షణ కల్పిస్తున్నాం. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. కాలేజ్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ (సీపీఈ) ప్రోగ్రాం కింద మంజూరైన రూ.1.20 కోట్ల నిధులతో కళాశాలలో విద్యాపరమైన సదుపాయాలను కల్పిస్తున్నాం. మరోసారి నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ కోసం కృషి చేస్తున్నాం.– డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement