డెరైక్టర్లను నియమించని రాష్ట్ర {పభుత్వం
టీడీపీలో అంతర్గత కలహాలే కారణం
గుంటూరు : ఎట్టకేలకు గుంటూరు మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా మన్నవ సుబ్బారావు నియమితులయ్యారు. అయితే ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని నియమించలేదు. వాస్తవానికి చైర్మన్ పదవితో పాటు 19 మంది డెరైక్టర్ల పేర్లను సైతం ఒకేసారి ప్రకటించడం ఆనవాయితీ.అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాల కారణంగా డెరైక్టర్లను ఇప్పటి వరకు నియమించలేదని సమాచారం.
డెరైక్టర్ల పదవులకు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యే...
తొలి నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి యార్డు ైచైర్మన్ పదవిని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసి ఓడిపోయిన వెన్నా సాంబశివారెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో సైతం డెరైక్టర్ల పేర్లను ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో చైర్మన్ పదవిని మన్నవకు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టయింది.అదేసమయంలో వెన్నాకు ఏదొక కార్పొరేషన్ పదవి ఇస్తామని, ఆయనకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదుగుల మాత్రం వెన్నా సాంబశివారెడ్డికి న్యాయం జరగని పక్షంలో యార్డు డైరక్టర్ల పదవులకు పేర్లు ఇచ్చేది లేదని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఎంపీపీ నుంచి...
ఇదిలాఉంటే యార్డు చైర్మన్‌గా నియమితులైన మన్నవ సుబ్బారావు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1987లో మేడికొండూరు మండల పరిషత్ అధ్యక్షునిగా, 1993లో మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. తర్వాత జిల్లా పార్టీలో పలు పదవులను ఆయన నిర్వహించారు. ఎన్నికల సమయంలో చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా పనిచేయడంతో పాటు జిల్లా ఎన్నికల మానటరింగ్ సెల్ కన్వీనర్‌గా పనిచేశారు.
పూర్తిస్థాయిలో కార్యవర్గం ఎంపిక తర్వాతే ప్రమాణస్వీకారం
పార్టీ అధిష్టానం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉంది. అయితే ఈ పదవిని కోరుకోలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయడమే నా పని. ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో యార్డుకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులో యార్డు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తాం. రైతుల సంక్షేమం కోసం నా శక్తి వంచనలేకుండా కృషిచేస్తా.
- మన్నవ సుబ్బారావు