
మహాకవి గురజాడ ముని మనుమని ఆత్మహత్య
రాజమండ్రి : మహాకవి గురజాడ అప్పారావు ముని మనుమడు, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ గురజాడ శ్రీనివాస్(47) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమం డ్రి పట్టణం ప్రకాశ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీని వాస్‌కు ఇటీవల రాజమండ్రి నుంచి కాకినాడ బదిలీ అయింది. అక్కడి కార్యాలయం పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆయన ఈ నెల 17న రాజమండ్రిలోని ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, శ్రీనివాస్ భార్య లలిత కొత్త ఇంటిలో పాలు పొంగించేందుకు శనివారం కాకినాడ వెళ్లారు. రాజమండ్రి కార్యాలయం సిబ్బంది శ్రీనివాస్ మొబైల్‌కు అనేకసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూసేసరికి పడకగదిలో ఫ్యాన్ కొక్కేనికి తువాలుతో ఉరేసుకున్న శ్రీనివాస్ కనిపించారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పగా ప్రకాశ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన భార్య లలిత కాకినాడ నుంచి వచ్చారు. పుణేలో చదువుతున్న శ్రీనివాస్ కుమారుడు రాజమండ్రి బయల్దేరాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.