
హంద్రీ-నీవాపై అలసత్వమెందుకు?
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం ....
జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేదాకా పోరాటం
నేడు వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద రైతుల జలజాగరణ
‘అనంత’ అన్నదాతలంతా పాల్గొని విజయవంతం చేయాలి
ఉరవకొండ ఎమ్మెల్యే
వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు
కూడేరు :హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం కూడేరులో విలేకరులతో మాట్లాడారు. హంద్రీ-నీవాపై ప్రభుత్వానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టు వ్యవస్థలు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాన కాలువ పనులు మాత్రమే చేస్తూ జిల్లాలో సాగునీరిచ్చే విషయాన్ని గాలికి వదిలేసిందన్నారు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పక్కన పెట్టాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, అందుకే వాటి కోసం టెండర్లు పిలవలేదని వివరించారు. అత్యంత తక్కువగా సాగునీటి సౌకర్యమున్న జిల్లాలో హంద్రీ నీవాపై నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీబీ డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు రావాల్సిన నీటిలో 30 టీఎంసీలను కోల్పోతున్నామన్నారు.
ఈ నికరజలాలను హంద్రీ- నీవాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు ఇవ్వాల్సిన 25 టీఎంసీల నీటిని కచ్చితంగా సరఫరా చేయాలని, కానీ సీఎం చంద్రబాబు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హంద్రీ-నీవాను ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా కుదించే ప్రయత్నాన్ని బాబు చేశారని, మళ్లీ ఇప్పుడు చెరువులకు మాత్రమే నీరంటూ జిల్లాకు పది టీఎంసీలతోనే సరిపెట్టే కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి హంద్రీ-నీవా ద్వారా సాగునీటిని పొందేందుకు రైతులతో కలిసి దశలవారీ ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో భాగంగానే శనివారం వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద ‘రైతుల జాగరణ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అఖిలపక్ష నేతలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతలు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, జయరాం, ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత వై.మధుసూదన్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జగదీష్, రాంభూపాల్‌తో పాటు పలువురు హాజరవుతున్నట్లు తెలిపారు.