కరువు కఠినం.. బతుకు జటిలం!
నాలుగు ఎకరాల పొలమున్న రైతన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నెలకు రూ.8 వేల వేతనానికి సెక్యూరిటీ గార్డుగా చేరిపోయాడు.
నలుగురికి అన్నం పెట్టాల్సిన చేతులతో వచ్చి పోయే వాళ్లకు సెల్యూట్ చేస్తూ బతుకుతున్నాడు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని కురబలకోట గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ దీనగాథ ఇది. ఒక్క రామకృష్ణ మాత్రమే కాదు, ఇలా ఎంతో మంది సొంత ఊరిలో సరైన ఉపాధి లేక పొట్ట చేతబట్టుకొని పొరుగు రాష్ట్రానికి వలస పోతున్నారు. చదువుకు తగిన ఉద్యోగాలు లభించక.. పూట గడిస్తే చాలనుకుంటూ వలస జీవితాల్లో గడిపేస్తున్నారు.
పొట్ట చేతబట్టుకొని పొరుగు రాష్ట్రానికి సీమ వాసులు
నిర్మాణ, సేల్స్ రంగంలోకి ఎక్కువ శాతం యువత
తర్వాతి స్థానంలో హాస్పిటాలిటీ, ఐటీ
బెంగళూరు: ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో తీవ్ర కరువు కారణంగా వ్యవసాయ పనులు లేక కొందరు, చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క మరికొందరు కుటుంబ పోషణ కోసం ఉన్న ఊరిని వదిలి పని వెతుక్కుంటూ కర్ణాటకకు వలస పోతున్నారు. రాయలసీమలోని వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి నిత్యం దాదాపు 200 నుంచి 300 మంది బతుకుదెరువును వెదుక్కుంటూ బెంగళూరు బాట పడుతున్నారు. ఇక కర్ణాటక, ఏపీలకు సరిహద్దుగా ఉన్న అనంతపురం నుంచి వలసలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
కూడు పెడుతున్న నిర్మాణ రంగం!
ఉద్యాననగరి బెంగళూరులో అత్యంత ఎక్కువ మంది వలస కార్మికులు నిర్మాణ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. బెంగళూరులో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుండడం కార్మికులకు కలసివస్తున్న అంశం. కర్ణాటక స్టేట్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ సెంట్రల్ యూనియన్ లెక్కల ప్రకారం బెంగళూరు నిర్మాణ రంగంలో దాదాపు 4 లక్షల మంది కార్మికులున్నారు. వీరిలో 20 శాతం మంది(80,000) తెలుగు వారేనని యూని యన్ ప్రెసిడెంట్ ఎన్.పి.సామి ‘సాక్షి’కి తెలిపారు.వీరిలో 40 వేల మంది సీమ వారేనన్నారు. నిర్మాణ రంగం తర్వాత అధికులు టెక్స్‌టైల్స్ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. బెంగళూరులోని దొడ్డబళ్లాపురం కేంద్రంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమ నడుస్తోంది. ఇక్కడి అపెరల్ పార్క్‌లో ఉన్న 50 పరిశ్రమల్లో 30 వేల మంది పనిచేస్తున్నారు. వారిలో 10 వేల మంది సీమకు చెందిన వారు.
బాబు వచ్చినా జాబు రాలేదు
బాబు వస్తే జాబు వస్తుందని ఆశించిన వేలాది మంది యువతీ, యువకులకు ఆ హామీలన్నీ నీటిమీద రాతలయ్యాయి. చదువుకు తగిన ఉద్యోగం దొరక్క పోవడంతో బెంగళూరుకు వలస పోతున్నారు. ఓ ప్రముఖ రిటైల్ చైన్ సంస్థలో సేల్స్ గర్ల్‌గా విధులు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన స్వప్న ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రెండేళ్ల క్రితం తిరుపతిలో డిగ్రీ పూర్తి చేశాను. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీలను నమ్మి ఓట్లేశాం. కానీ, నెరవేరలేదు. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక ఇటీవలే బెంగళూరు వచ్చాను. ఇక్కడి రిటైల్ చైన్ సంస్థలో రూ.7 వేల జీతానికి పని చేస్తున్నాను’ అని చెప్పారు.
ఉపాధి లేదు హామీ ఉంది!: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఉపాధి హామీ’ సీమ ప్రజలకు ఉపాధిని అందిస్తోందా అంటే లేదనే చెప్పాలి.కొంతమందికి మాత్రమే ఉపాధి పనులు లభిస్తున్నాయని కుటుంబ పోషణార్థం నగరానికి వచ్చిన అనంతపురం జిల్లా పెనుగొండ మండలం కురవవాండ్లకుచెందిన వరలక్ష్మి అనే రైతు చెప్పారు. ఆమె, భర్త ముగ్గురు పిల్లలతో కలసి 3 నెలల క్రితం బతుకు దెరువు కోసం బెంగళూరు చేరారు.భర్త యలహంక పరిసర పొలాల్లో కూలికి వెళుతున్నాడు. ఆమె కూడా కూలిపైనే ఆధారపడుతున్నానంది.