
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ రెండు కమిటీల ఏర్పాటు ఎట్టకేలకు గురువారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా డాక్టర్ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. అలాగే సీమాంధ్ర ప్రాంత బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్న జి.కిషన్‌రెడ్డి ఇకనుంచీ కొత్త రాష్ట్రం తెలంగాణకు అధ్యక్షునిగా కొనసాగుతారు. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదలైంది.
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందగానే రెండు కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ జాప్యం జరుగుతూ వచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి రెండు కమిటీలను ఏర్పాటు చేస్తారని భావించినా అలాటి పరిస్థితి లేకపోవడంతో పార్టీ జాతీయనాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి పార్లమెంటులో బిల్లుకు పూర్వమే ఉభయప్రాంతాల నాయకులు ముఖాలు చూసుకునే పరిస్థితి లేకపోయింది. ప్రాంతాలవారీగా పార్టీ నేతలు విడిపోయి వాదనలకు దిగారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఎవరి పంతం వారు నెగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని ఖాతరు చేయకుండానే సీమాంధ్ర నేతలు ఢిల్లీలో జాతీయ నాయకత్వానికి నివేదికలు అందజేశారు. బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. వాటిని ఖాతరు చేయవద్దంటూ కిషన్‌రెడ్డి ఏకంగా ఢిల్లీలోనే నిరాహారదీక్ష చేపట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని పలువురు తప్పుబట్టారు. ఆయనపై ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు బహిరంగంగానే విమర్శలకూ దిగారు. దీంతో వెంకయ్యనాయుడు సాక్షాత్తూ పార్టీ కార్యాలయంలోనే ఒంటరి కావడంతో సీమాంధ్రనేతలు ఆ ఛాయలకే రాకుండా పోయారు. దీంతో పరిస్థితిని గమనించిన జాతీయ నాయకత్వం రెండు శాఖలకు వేర్వేరుగా అధ్యక్షుల్ని ప్రకటించి తన కర్తవ్యాన్ని పూర్తిచేసింది. ఈ మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అధ్యక్షునిగా హరిబాబును బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నియమించారు. వాస్తవానికి సోము వీర్రాజు అధ్యక్ష పదవికి పోటీపడినా జాతీయ నాయకత్వం హరిబాబుకే ప్రాధాన్యమిచ్చింది. కాగా, ఇది పదవి కాదని, బాధ్యత మాత్రమేనని హరిబాబు వ్యాఖ్యానించారు. పార్టీ సీమాంధ్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సీమాంధ్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.