బాబు తీరుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది | MP Haribabu Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు తీరుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది

Published Sat, May 26 2018 4:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

MP Haribabu Fires on CM Chandrababu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న హరిబాబు

సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ ఇప్పుడు ఆ కాంగ్రెస్‌తో జత కట్టేందుకు తహతహలాడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు.  కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ టీడీపీని కాంగ్రెస్‌ వైపు దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న ఆరాటాన్ని ఎన్టీఆర్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని హరిబాబు చెప్పారు. బాబు తీరుతో పైనున్న ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందన్నారు. కర్ణాటకలో జరిగిన కుమార స్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో బాబు అసలు స్వరూపం బయట పడిందని తెలిపారు. 1996 నాటి రాజకీయ పరిస్థితులు పునరావృత మవుతు న్నాయని, ఆనాడు కాంగ్రెస్‌తో జతకట్టి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మద్దతు పలికిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపో లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 2019 ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.

విభజన హామీలు నెరవేర్చాం..
విభజన హామీల్లో 85 శాతం అమలు చేశామని హరిబాబు చెప్పారు. రైల్వే జోన్‌తోపాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజు పోర్టు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, గిరిజన విశ్వవిద్యాలయం మాత్రమే మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్యాకేజీని ఆహ్వానించిన బాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలి
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. పోటులో తవ్వకాలు, జెనీవాలో వేలం వేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందేనన్నారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో నియమించిన ధార్మిక మండలి పదేళ్లు పనిచేసిందని.. చంద్రబాబు హయాంలో ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు.  బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement