హరిబాబు జోరు..అశోక్ బేజారు | haribabu vs ashok gajapati raju in vizaianagaram politics | Sakshi
Sakshi News home page

హరిబాబు జోరు..అశోక్ బేజారు

Published Sat, Feb 7 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

హరిబాబు జోరు..అశోక్ బేజారు

హరిబాబు జోరు..అశోక్ బేజారు

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ ఆయన. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు పర్యవేక్షణపై  ఆయన ఆధ్వర్యంలోనే సమీక్ష ఆసాంతం జరగాల్సి ఉంది. అయితే జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో  పక్కజిల్లా ఎంపీ హవా ప్రదర్శించేసరికి సాక్షాత్తు కమిటీ చైర్మన్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. 'ఎంపీ రివ్యూ చేస్తున్నారు...కేంద్రమంత్రి చూస్తున్నారు' అంటూ గుసగుసలాడుకున్నారు.
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు, పర్యవేక్షణపై నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు దూకుడు చూపించారు.  కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కమిటీకి చైర్మన్ అయినప్పటికీ  హరిబాబు దాదాపు ఓవర్ టేక్ చేశారు. హరిబాబు సమావేశానికి  రాక ముందు వరకే అశోక్ సమీక్ష కన్పించగా, ఆ తర్వాత హరిబాబు హవాయే కన్పించింది.

దీంతో అశోక్ దాదాపు  ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  స్థానిక డీఆర్‌డీఎ సమావేశం హాల్‌లో ఉదయం 11.30గంటలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభమైంది. కమిటీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు రాష్ర్టమంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, కె.ఎ.నాయుడు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎజెండాలో పేర్కొన్న ప్రకారం అశోక్ సమీక్ష మొదలు పెట్టారు.
 
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందే పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఒకటి రెండు సందర్భాల్లో అధికారులిచ్చే వివరణపై అశోక్ అసంతృప్తి చెందుతూ గత ప్రభుత్వ హయాంలో షాడో నేత, బ్రోకర్లను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ చర్చకొచ్చింది. అదే సమయంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. హౌసింగ్ పీడీ శాఖా పరంగా అమలవుతున్న పథకాల్ని వివరిస్తుండగా హరిబాబు జోక్యం చేసుకుని ఐఏవై కింద ఎవరికి ఇళ్లు మంజూరు చేశారని, వాటి జాబితా ఏదని, ఏ ప్రకారం లబ్ధిదారుల్ని ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీనికి హౌసింగ్ పీడీ సూటిగా సమాధానం చెప్పలేదు. లబ్ధిదారుల ఎంపిక తాము చేయలేదని, హౌసింగ్ ఎం.డి. చేశారని, అక్కడి నుంచే మంజూరు జాబితా వచ్చిందని చెప్పడంతో హరిబాబులో ఆగ్రహించారు.

ఈ సందర్భంలో రాష్ట్రమంత్రి కిమిడి మృణాళిని జోక్యం చేసుకోగా అధికారుల్ని వెనకేసుకుని రావద్దని సుతిమెత్తగా మంత్రికి సూచిం చారు. అక్కడి నుంచి డ్వామా, డీఆర్‌డీఎ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఐటీడీఎ, ఉద్యానవన శాఖ, ట్రాన్స్‌కో తదితర శాఖలపై దాదాపు హరిబాబే సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారినీ గట్టిగా నిలదీశారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలపై కూడా విరుచుకుపడ్డారు.
 
మధ్యలో ఒకటి రెండు సందర్భాల్లో అశోక్ మాట్లాడేందుకు ప్రయత్నించినా హరిబాబు స్పీడుకు వెనక్కి తగ్గారు. అసలీ కమిటీకి చైర్మన్ అశోకా, హరిబాబా అని పలువురు లోలోపల చర్చించుకున్నారు. గ్యాప్ ఇవ్వకుండా హరిబాబు సమీక్ష చేయడంతో ఎందుకొచ్చిందనుకున్నారో ఏమో గానీ అశోక్ చూస్తూ ఉండిపోయారు. సమీక్ష సమయం ఎక్కువవడంతో అశోక్ గజపతిరాజుకు ఆవలింతలు కూడా వచ్చేశాయి. అప్పుడైనా హరిబాబు వెనక్కి తగ్గుతారేమోనని పలువురు ప్రజాప్రతినిధులు ఆశించారు. కానీ చివరి వరకు ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement