జగన్‌పై హత్యాయత్నం: ఏసీపీ అర్జున్‌ ఓవరాక్షన్‌ | Harsha Vardhan has been questioned by police | Sakshi
Sakshi News home page

హర్షవర్దన్‌ను విచారించి వదిలేసిన పోలీసులు

Published Sun, Oct 28 2018 4:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

Harsha Vardhan has been questioned by police - Sakshi

ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో హర్షవర్దన్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్న తీరు ఇదీ..

సాక్షి, విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ అధినేత, టీడీపీ విశాఖ అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరిని ఎట్టకేలకు ఎయిర్‌పోర్టు పోలీసులు విచారించారు. శనివారం మధ్యాహ్నం ఆయన్ని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. సిట్‌ బృందంలోని సీఐ లక్ష్మణమూర్తి ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి నోటీసులిచ్చారు. అనంతరం విడిచిపెట్టారు. మీడియాలో వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికే హర్షవర్దన్‌ను మొక్కుబడిగా విచారించి, వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

‘సిట్‌’ అదుపులో మరో ఇద్దరు 
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వివిధ విమానయాన సంస్థల ఉద్యోగులు, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ సిబ్బందిని శనివారం సీఐఎస్‌ఎఫ్, సిట్‌ అధికారులు విచారించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు రెస్టారెంట్‌లోని మిగతా సిబ్బందితో ఉన్న సంబంధాలు, అతడి వ్యవహారశైలి తదితర అంశాలపై ఆరా తీశారు.  ఎయిర్‌పోర్టులో విమానయాన సంస్థల ఉద్యోగులతోనూ శ్రీనివాసరావు ఎలా మసలేవాడు? ఎవరితో సత్సంబంధాలు కొనసాగించాడు? వంటి విషయాల గురించి వాకబు చేశారు. ఫ్యూజన్‌¯ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఇద్దరిని ‘సిట్‌’ సభ్యులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. శ్రీనివాసరావు 11 పేజీల లేఖను రాసినట్టు చెబుతున్న  శ్రీనివాసరావు సోదరి (వరసకు) విజయలక్ష్మి, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పలాసకు చెందిన రేవతీపతిలను రెండో రోజూ సిట్‌ పోలీసులు రహస్యంగా విచారించారు. చెన్నై నుంచి వచ్చిన సీఐఎఫ్‌ఎఫ్‌ ఐజీ సీవీ ఆనంద్, డీఐజీ సెల్వంలు ఎయిర్‌పోర్టు భద్రతపై సమీక్షలు కొనసాగించారు. 

ఏసీపీ అర్జున్‌ ఓవరాక్షన్‌ 
జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ సాగిస్తున్న ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ను పర్యవేక్షించే నార్త్‌ జోన్‌ ఏసీపీ లంకా అర్జున్‌ ఓవరాక్షన్‌ విమర్శల పాలవుతోంది. విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అభిమాని అని చెప్పడానికే ఆయన ఎక్కువగా తాపత్రయ పడ్డారు. నిందితుడు అమాయకుడంటూ పదేపదే పేర్కొంటూ అతడి తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడారు. చెక్కు చెదరని క్రాఫ్‌తో నవ్వుతూ కనిపించిన నిందితుడు శ్రీనివాసరావును చూస్తే లంకా అర్జున్‌ ఆధ్వర్యంలోని బృందం విచారణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement