హర్తాళ్ విజయవంతం
ప్రజల మద్దతు సంపూర్ణం
- విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేత
- ఏపీలో ఆందోళనకారుల అణచివేత
- అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
- ప్రతిఘటించిన వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు శ్రేణులు
సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న అగచాట్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించే చర్యల కోసం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా పిలుపు నిచ్చిన హర్తాళ్‌కు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడింది. ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంది. పోలీసు బలగాలను భారీగా మోహరించి, మునుపెన్నడూ లేని రీతిలో డ్రోన్లను సైతం ఉపయోగించి ఆందోళన కారులపై నిఘా వేసింది. అయినా రాజకీయ పార్టీల నేతలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేయడంలో కృతకృత్యులయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పకడ్బందీగా హర్తాళ్‌లో పాల్గొన్నాయి. ఆ పార్టీ నేతలను పలు చోట్ల గృహ నిర్బంధం చేసినా, రోడ్ల మీదకు వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా ప్రతిఘటిస్తూ వారంతా నిరసన ల్లో పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలం కావడంతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అరుుందనే ఆగ్రహంతో జాతీయ స్థారుులో ప్రతిపక్షాలు, వామపక్షాలు ఇచ్చిన హర్తాళ్ పిలుపునకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతును ప్రకటించి, స్వచ్ఛందంగా ఈ ఆందోళనలో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది.
పేదలు పడుతున్న ఇక్కట్లను పరిష్కరించడంతో పాటు, పాత నోట్ల చలామణిని డిసెంబర్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కొనసాగించిన ఈ హర్తాళ్‌లో వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ అరెస్టు అయ్యారు. రాజధాని కేంద్రమైన విజయవాడ నగరంలో అరెస్టరుున వామపక్షాల నేతలను వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. రాష్ట్రంలో హర్తాళ్ విజయంతమైనందుకు వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హర్తాళ్‌లో పాల్గొనే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలను పసి గట్టే పేరిట పోలీసులు మొదటిసారి కృష్ణా జిల్లాలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యమంత్రి స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షించడం చర్చనీయాంశమైంది.