సాక్షి, హైదరాబాద్: రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ ఇలా వ్యాపారం చేస్తే ఎలా?’ అంటూ నిలదీసింది. ‘రైళ్లలో కూడా ప్రయాణికులు వెళుతున్నారు. రైల్వేశాఖ అధిక చార్జీలు వసూలు చేయడం లేదు కదా’ అని వ్యాఖ్యానించింది. ఎందుకు అధిక చార్జీలను వసూలు చేయాల్సి వస్తుందో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానుల ధర్మాసనం ఆదేశించింది.
పండుగలు, ఇతర పర్వదినాలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి దాదాపు 150 శాతం అధికంగా చార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దానిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజల నుంచి అధిక మొత్తాలను వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి అనుమతినిచ్చిందని, ఆ మేర 2003లోనే జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆర్టీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వం అనుమతించినందునే అధిక చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. రోజూ వారి బస్సులకు తాము అధిక చార్జీలను వసూలు చేయడం లేదని, పండుగ లు, సెలవు దినాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పా టు చేసే ప్రత్యేక బస్సుల్లోనే అధిక చార్జీలను వసూలు చేస్తున్నామని వివరించారు. దానిపై సంతృప్తి చెందని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.
ఈ అధిక చార్జీల బాదుడేంటి?
Published Tue, Oct 22 2013 6:48 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement