సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ భర్త భరతసింహారెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్, రేషన్ కిరోసిన్ అక్రమ వినియోగం తదితర ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మహబూబ్‌నగర్ జిల్లా అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
భరతసింహారెడ్డి మన్నాపురం గ్రామ పరిధిలోని భూమిలో చేస్తున్న మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ గద్వాల్ టౌన్‌కు చెందిన మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు బి.కృష్ణమోహన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున కాల్వ సురేష్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎకరా భూమిలో మైనింగ్ ప్రారంభించిన భరతసింహారెడ్డి, దానిని అక్రమంగా 20 ఎకరాలకు విస్తరించారని కోర్టుకు నివేదించారు.
ఈ మైనింగ్ కార్యకలాపాలకు నీలి కిరోసిన్‌ను ఉపయోగిస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, ఫిర్యాదుల ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. విచారణ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఫిర్యాదు అవాస్తవమని తేలితే, పిటిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.