అవినీతికి మరోపేరు.. ఈ సారు! | He is nick name to corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి మరోపేరు.. ఈ సారు!

Published Sat, Nov 5 2016 4:29 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

ఆయన గెజిటెడ్‌ ఆఫీసర్‌ కాదు.. అయినా పచ్చ ఇంకుతో సంతకాలు పెట్టేస్తారు.. అభివృద్ధి కంటే అవినీతికే పెద్ద పీట..

* అర్హత లేకున్నా పచ్చ ఇంకుతో సంతకాలు
పిడుగురాళ్ల మున్సిపల్‌ ఉన్నతాధికారి నిర్వాకం
దోపిడీకి పాల్పడినా మూడు నెలల్లో ఉద్యోగంలోకి..
కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ లేఖరాసిన పట్టించుకోని వైనం
అధికార పార్టీ నేత అండతో దాష్టీకాలు
 
ఆయన గెజిటెడ్‌ ఆఫీసర్‌ కాదు.. అయినా పచ్చ ఇంకుతో సంతకాలు పెట్టేస్తారు.. అభివృద్ధి కంటే అవినీతికే పెద్ద పీట వేస్తారు..రోడ్డు పక్కన తోపుడు బండి కనిపిస్తే చాలు డబ్బులు వసూలు చేయమంటూ కిందిస్థాయి ఉద్యోగులను సతాయిస్తారు.. దోపిడీకి పాల్పడ్డ ఉద్యోగికి అండగా నిలుస్తారు.. నాలుగు దోపిడీ కేసుల్లో నిందితులుగా పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ, అతనిపై కఠిన చర్యలు తీసుకోమంటూ పోలీసు అధికారులు సూచించినప్పటికీ ఈయన పట్టించుకోరు. అధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండటంతో ఎవ్వరిని లెక్కచేయరు.. ఇది పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఓ ఉన్నతాధికారి నిర్వాకం.
 
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి పట్టణంలో చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు. నిబంధనలకు పాతర వేస్తూ ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తూ అధికార పార్టీ నేత అండతో  డిప్యూటేషన్‌పై పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పాగా వేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ ఫైల్‌ కదలాలన్నా ఈయనకు ముడుపులు ముట్టాల్సిందే. గజిటెడ్‌ అధికారికి మాత్రమే పచ్చ ఇంకుతో సంతకాలు చేసే అధికారం ఉంటుంది. అయితే ఈయన గజిటెడ్‌ అధికారి కానప్పటికీ య«థేచ్ఛగా పచ్చ ఇంకుతో సంతకాలు చేస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు.
 
చిరు వ్యాపారుల బెంబేలు..
స్వీట్‌ బండి వద్దకు తన కింది స్థాయి ఉద్యోగులను పంపి కేజీల కొద్ది స్వీట్లు తెప్పించుకుంటారు. డబ్బులు అడిగితే రోడ్డు పక్కన వ్యాపారం చేసుకోవాలని లేదా అంటూ బెదిరించినట్లు సదరు వ్యాపారి వాపోయారు. యాంపోగు యేసుబాబు అనే కొబ్బరిబొండాలు అమ్ముకునే చిరు వ్యాపారిని డబ్బులు డిమాండ్‌ చేసి, ఇవ్వలేదనే కోపంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఆయన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. షేక్‌ సైదా అనే పండ్ల వ్యాపారికి రెండు కళ్లు లేవు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే ఇతనిపై అధికారి కళ్లు పడ్డాయి. డబ్బు కోసం వేధింపులకు దిగడంతో సైదా మానవ హక్కుల సంఘం, లోకాయుక్తను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. సదరు అధికారిపై ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరుపుతున్నారు.
 
దొంగతనం చేసిన వారికి అండగా..
ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ అర్ధరాత్రి మున్సిపాల్టీలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి ఉద్యోగి అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఉద్యోగిని ఇంటిలోకి వెళ్లి రూ.35 వేలు నగదుతోపాటు, బంగారం దొంగిలించారు. పోలీసుల విచారణలో సదరు ఉద్యోగి నిందితుడు అని తేలడంతో అరెస్టు చేసి విచారించారు. గతంలోనూ మరో నాలుగు దొంగతనాలు చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో సదరు ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. అయితే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులు మున్సిపల్‌ అధికారులకు లేఖ రాసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మూడు నెలలు తిరగకుండానే సెప్టెంబరు 26వ తేదీన తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకున్నారు. ఈ విషయంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement