బాబు మోసం చేశాడు | He was betrayed | Sakshi
Sakshi News home page

బాబు మోసం చేశాడు

Published Sun, Dec 29 2013 4:31 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బాబు మోసం చేశాడు - Sakshi

బాబు మోసం చేశాడు

=1999లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని ఇవ్వలేదు
 =2004లో నా భార్యకు బలవంతంగా టికెటిచ్చారు
 =ఆమె ఓడిపోవడంతో ఉన్న ఉద్యోగమూ పోయింది
 =నా నిజాయితీని బాబు పట్టించుకోలేదు
 =పార్టీలో గుర్తింపు లేకుండా చేశారు
 =వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ

 
పలమనేరు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానని, పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా తనను, తన కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేశారని వేంపజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ ఘాటుగా విమర్శించారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దవెలగటూరులో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

అనంతరం పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1994లో వేపంజేరి ఎమ్మెల్యేగా పనిచేశానని, చంద్రబాబుకు ప్రధాన అనుచరునిగా ఉన్నానని చెప్పారు. అయితే చంద్రబాబు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్ల సిద్ధాంతమని, సమన్యాయమని ఆయన చెప్పిందానికల్లా అడ్డు చెప్పకుండా పోతే ఓకే అని, అలా కాదంటే తర్వాత ఎవరినీ పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు వైఖరితో రాజకీయంగా ఎంతో నష్టపోయానన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆపై ఎందుకు కొరగాకుండా చూడడం ఆయన నైజమన్నారు.

1999లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆపై మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తన భార్యకు 2004లో చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, తమ కుటుంబంలో ఆయన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించి రాజకీయం నడిపిన ఘనుడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందిందని, ఎన్నికల్లో పోటీచేయడంతో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయి ఎంత ఇబ్బంది పడ్డామో ఆయనకేమి తెలుసన్నారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పాటుపడినందుకు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో బాబుకు నమ్మకస్తునిగా మెలిగానని, అయితే ఆయన  తనను అసలు పట్టించుకోలేదన్నారు. జేబులో చంద్రబాబు బొమ్మలేకుండా బయటకు వెళ్లలేదన్నారు.  హైదరాబాద్‌లో తన బైక్‌కు సైతం పసుపు రంగు కొట్టించి చంద్రబాబు ఫొటోతో తిరిగేవాడినని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటి నమ్మకంగా వ్యవహరించిన తనకు గుర్తింపు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ పార్టీ విధానాలు అసలు నచ్చలేదన్నారు. మొత్తం మీద ఈ కారణాలతో తాను ఆ పార్టీని వీడానన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.

2004 ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందినప్పుడు తిరిగి ఉద్యోగం కావాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలసి పరిస్థితిని వివరించానన్నారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడినైనా ఆయన సాయం చేశారన్నారు. అందుకే తనకు వైఎస్ అంటే వల్లమాలిన అభిమానమన్నారు. తాను పార్టీలో చేరినందున తనపై కూడా ప్యాకేజీ తీసుకున్నాననే ఆరోపణలు టీడీపీ నేతలు చేసే అవకాశం ఉందన్నారు.

తాను ఆనాడు వైశ్రాయ్ హోటల్‌లో బాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నట్లు చెప్పుకున్నారని, అదెంత నిజమో ఇప్పుడు తాను వైఎస్సార్‌సీపీ వద్ద ఏదైనా పుచ్చుకున్నాననే విషయంలోనూ అంతే నిజముంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు అమరనాథ రెడ్డి, మనోహర్, నారాయణ స్వామి, ఆదిమూలం, కేశవులు, వినయ్‌రెడ్డి, సునీల్, సీవీ కుమార్, హేమంత్, సుధా, వంగపండు ఉష తదితరులున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement