సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం ప్రీమియం వసూలును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మార్చి నెల జీతం నుంచి ప్రీమియం వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఉద్యోగులు కోరిన విధంగా పథకంలో ఉన్న లోపాలు సవరించడం ఇప్పట్లో సాధ్యం కాదని, అందువల్ల హెల్త్‌కార్డుల పథకం అమలుపై నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వాలకు విడిచిపెట్టాలని తాజాగా నిశ్చయించారు. ఈ నేపథ్యంలో హెల్త్‌కార్డుల పథకం ప్రీమియం వసూలును వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం తనను కలసిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందానికి చెప్పారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ కొనసాగుతుందంటూ ఉత్తర్వులివ్వాలని తాము చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రీమియం వసూలు చేయవద్దనే ఉత్తర్వులతోపాటు రీయింబర్స్‌మెంట్ కొనసాగింపు ఆదేశాలు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశముందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా విభజన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను కమల్‌నాథన్ కమిటీకి నివేదించాలని ఉద్యోగ సంఘాలకు సీఎస్ సూచించారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగులకే ఆప్షన్ సౌకర్యం ఉంటుందని, మిగతా వారికి ఉండబోదన్నారు.