సూరీడుకు చిర్రెత్తుతోంది..!
జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్: మార్చి నెలలోనే ఎండలు మండుతుండటంతో డయేరియాతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని వైద్యు లు సూచిస్తున్నారు. గురువారం రోజు పగ టి ఉష్ణోగ్రతలు ఏకంగా 40.33డిగ్రీలకు చేరింది. గతేడాది ఏప్రిల్ మాసంలో ఇవి నమోదయ్యాయి. అదే విధంగా రాత్రి వేళ ఉక్కబోత పెరగటంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలపాలవుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉండే అభ్యర్థులు, రాజకీయ నేతలు మినహాపల్లెల్లో పగటిపూట పూర్తిగా నిశబ్దవాతావరణం నెలకొంది. పట్టణం, పల్లె తేడా లేకుండా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు...
ఎండలు పెరగటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గంగాపూర్‌పీహెచ్‌సీలో గత కొద్దిరోజులు గా ఓపికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వాంతులు, విరేచనాలతో చికిత్సకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి మూడో వారం నుంచి రోజూ 15మందికి తగ్గకుండా ఇన్‌పేషెం ట్లుగా చేరుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి...
ఎండలు మండుతుండటంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ఆ ప్రకారం వదులుగా ఉన్న కాటన్‌దుస్తులు ధరించాలి. చిన్నపిల్లలకు కనీసం రెండు పర్యాయాలు గోరువెచ్చటి నీటితో స్నానం చేయించటం, ఎండలో తిరగకుండా చూడాలి. డీహైడ్రేషన్ అయితే ఎలక్ట్రాల్ పౌడర్ తాపాలి. గర్భిణిల్లో మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వారు ప్రతి అరగంటకోమారు గ్లాసునీటిని తాగాలి. బైక్‌పై వెళ్లేవారు తప్పనిసరిగా క్యాప్ ధరించటంతోపాటు తరచూ నిలిచినీళ్లు తాగు తూ వెళ్లాలి. కొబ్బరి నీళ్లు తాగటం అందరికి శ్రేయస్కరం.