docters
-
గిరిజన ఆణిముత్యం.. నీట్లో ఆల్ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్
దహెగాం: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ కూలీ కూతురు. చిన్న తనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించింది. తండ్రి క్యాన్సర్‌తో ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో ఆ పసి మనసులో అప్పటి నుంచే డాక్టర్ కావాలని తలపించింది. మా నాన్నలాగా ఎవరు మృతిచెందవద్దనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో 427 మార్కులు సాధించగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్ కై వసం చేసుకుంది. కొలవార్ తెగలో వైద్య విద్యను పూర్తి చేస్తే తొలి విద్యార్థిని సంగర్ష్ స్రవంతి కానుంది. కుటుంబ నేపథ్యం.. కుమురంభీం జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన సంగర్ష్ శంకర్, బుచ్చక్కలకు ఐదుగురు ఆడపిల్లలే. అందులో ఐదో సంతానమైన స్రవంతి 1 నుంచి 5వ తరగతి వరకు చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు దహెగాంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదివింది. పదిలో 8.2 జీపీఏ సాధించింది. 9వ తరగతి చదువుతున్న క్రమంలో తండ్రి శంకర్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. శంకర్‌కు సరైన వైద్యం అందక చనిపోయాడని ఇరుగుపొరుగు వారు అనేవారు. అప్పుడే ఆమెలో డాక్టర్ కావాలనే ఆలోచన మొదలైంది. దీంతో బంధువుల సహకారంతో డీఆర్‌డీఏను సంప్రదింది హైదరాబాద్‌లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సీటు సాధించింది. ఇంటర్ బైపీసీలో 934 మార్కులు సాధించింది. కుంగిపోకుండా చదివి.. ఇంటర్ పూర్తి చేసిన స్రవంతి డాక్టర్ కావాలని కోరిక ఉండగా ప్రైవేటులో నీట్ శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్రాల్డ్లో నీట్ శిక్షణ తీసుకుంది. మొదటి ప్రయత్నంలో నీట్లో సీటు కోల్పోయింది. అయినా కుంగిపోకుండా అధైర్యపడకుండా పట్టుదలతో చదివి రెండోసారి 427 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు సాధించి వైద్య విద్యకు ఎంపికై ంది. వైద్య విద్య పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొలవార్ తెగలో మొదటి మహిళగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. నా బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకున్నా నా భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిండు. నాకు ఐదుగురు ఆడపిల్లలే. నలుగురు పిల్లల పెండ్లీలు చేసినా. స్రవంతి ఐదవ బిడ్డ ఆమె చిన్నప్పటి నుంచి మంచిగ చదువుకుంటుంది. స్రవంతిని డాక్టర్ చదివించాలని నా కోరిక నేను కూలీ పనులు చేసుకుంటు ఆమెను చదివిపిచ్చినా మేము కష్టపడినట్లు నా బిడ్డ కష్టపడవద్దని ఆమెను చదివిపించి డాక్టర్ చేయాలని అనుకున్న. స్రవంతి డాక్టర్ అయితందని అందరు అంటురు. నాకు ఆనందంగా ఉంది. – బుచ్చక్క, స్రవంతి తల్లి, చంద్రపల్లి పేదలకు వైద్యం అందిస్తా సరైన వైద్యం అందక మా నాన్న చనిపోయినట్లు ఊర్లో అందరూ అనేవారు. అప్పటి నుంచే డాక్టర్ కావాలని అనుకున్న. కష్టపడి చదివితే సాధించవచ్చని అనుకుని నీట్ మొదటి సారి రాస్తే ర్యాంక్ రాలేదు. అయినా బాధపడకుండా రెండో సారి కోచింగ్ తీసుకుని ప్రయత్నం చేయగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నాన్న లేకపోయినా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నిరుపేదలకు వైద్యం అందిస్తా. – స్రవంతి, చంద్రపల్లి -
‘సీఎం వైఎస్ జగన్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటా’
గుంటూరు: సీఎం సహాయనిధి ఆ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేసింది. ఎన్నోఏళ్ల నుంచి గూనితో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించింది. గుంటూరు కొత్తపేట నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 13, 14 తేదీల్లో న్యూరోమానిటరింగ్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంతారావు, వినోద్‌కుమార్ ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆస్పత్రి స్పయిన్ సర్జన్ డాక్టర్ దుంపా శ్రీకాంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.ఏడు లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు వివరించారు. శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టిందని, గూనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీతోనే నయం చేయొచ్చని వెల్లడించారు. సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండం శివశ్రీనివాసరెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్ష, క్రిటికల్‌కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు పాల్గొన్నారు. కాంతారావు కష్టాలకు ఇక చెల్లు ఈచిత్రంలో ఉన్న వ్యక్తిపేరు బి.కాంతారావు. వయసు 40 ఏళ్లు. ఊరు ఊటుకూరు. గూని వల్ల వెన్నుపూస పూర్తిగా ఒంగిపోయింది. రోజువారీ కూలీపనులు చేసుకునే ఇతను చాలా కష్టపడేవాడు. కొన్నిసార్లు కాలు జాలువారేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి వరమైంది. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సదా కృతజ్ఞుడినై ఉంటానని చెబుతున్నాడు. జీవితమంతా ‘వినోద్’మే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్. వయసు 17ఏళ్లు. ఊరు అమలాపురం. ఇంటర్ చదువుతున్నాడు. పుట్టుకతోనే గూని ఉంది. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడేవాడు. ఇటీవల నడుంనొప్పి, కాళ్ల తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడంతో తీరని వేదన అనుభవించాడు. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు సీఎం సహాయనిధి ఆయన జీవితంలో వెలుగులు నింపింది. ఆపరేషన్ చేయించింది. -
డాక్టర్లను నియమించకుండా గాడిదలు కాస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ రాష్ట్రానికి నియంతలా మారిన కేసీఆర్.. ముందు తన రాజకీయ క్రీడలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. తాము ఏడాది క్రితమే అన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యుల నియామకానికి చిట్టా ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం గాడిదలు కాసిందా? అని ప్రశ్నించారు. నవ్వులాటలు, గాలి మాటలతో ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టారని మండిపడ్డారు. వద్దంటే ఎన్నికలు పెట్టి నాగార్జునసాగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయ్యారని విమర్శించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని, కనీసం 15 రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కోరారు. వైరస్‌ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలో ఒక యాప్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల వివరాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఎప్పుడు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ కావాలో ఈ ప్రభుత్వం దగ్గర యాక్షన్ ప్లాన్ లేదని మండిపడ్డారు. చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క భేటీ -
సీటు బెల్ట్‌తో యువ డాక్టర్ సేఫ్
సాక్షి, రాజేంద్రనగర్: కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని ప్రమాదం నుంచి సురక్షితంగా ఓ యువ డాక్టర్ బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ పూర్ణాదేవీకాలనీకి చెందిన డాక్టర్ ఎ.దివ్యారెడ్డి(26) గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. గురువారం నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ దివ్యారెడ్డి శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. ఔటర్ పై నుంచి హిమాయత్‌సాగర్ వద్ద దిగి రాజేంద్రనగర్ మీదుగా చంద్రాయణగుట్ట వైపు వెల్తుంది. గాందీనగర్ మందిరం దాటగానే రోడ్డుపై ఓ వీధి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు కాస్తా పక్కనే ఉన్న సైన్‌బోర్డును ఢీకొని అలాగే ముందున్న రాళ్లను ఢీకొంటూ వెళ్ళి ఆగిపోయింది. ఆమె సీటు సీటు బెల్టు ధరించడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. వాహనం పూర్తిగా ధ్వంసమయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన దివ్యారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ జో జోర్గెన్సన్
విధ్వంసం.. పురుషుడి అభిమతం.. నిర్మాణం.. స్త్రీ లక్షణం.. దాదాపు ప్రతి ఇల్లే కాదు ప్రపంచ రాజకీయ తాజా పరిణామాలూ ఇవే చెప్తున్నాయి. ఇంటిని చక్కదిద్దినంత తేలికగా తమ పాలనలో ఉన్న దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను చక్కదిద్దుతున్నారు. ఈ నిజాన్ని కరోనా కూడా ప్రూవ్ చేసింది. మహిళలు ఏలికలుగా ఉన్న దేశాల్లో కరోనా కూడా కోరలు ముడుచుకుంది. కాదు ముడుచుకునేలా చేశారు. విధ్వంసంతో సవాళ్లను విసురుతూ ఉన్న పురుషులకు నిర్మాణంతో జవాబు ఇస్తున్నారు. అలాంటి సవాలే స్వీకరించింది ఓ స్త్రీ అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పోరులో నిలబడి. ఆమె పేరు జో జోర్గెన్సన్. వయసు..63. కమలా హారిస్ గెలుపు ముందు ఆమె ప్రయత్నం కనిపించకుండాపోయింది. అమెరికాలో నడుస్తున్న ద్విపార్టీ తీరును వ్యతిరేకించే, నిరసించే సమూహంలోని వ్యక్తి జోర్గెన్సన్. లిబర్టేరియన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఆమె. ఈ పార్టీ విజయావకాశాలు, పదవుల అర్హత వగైరాల చర్చ కాదు. నిర్మాణాత్మాక స్ఫూర్తి మాత్రమే సందర్భం. అందుకే జోర్గెన్సన్ పరిచయం. ఆమె మీద కరడుగట్టిన రిపబ్లికన్స్ అంతా గుర్రుమంటున్నారట. రిపబ్లికన్స్ ఖాతాలో పడాల్సిన జార్జియా రాష్ట్రం బైడెన్ వశం కావడానికి జోర్గెన్‌సనే కారణమని. అవును ఆమె వల్లే ట్రంప్ ఓట్లు చీలాయి. ఈ ఎన్నికల్లో జోర్గెన్‌సన్‌కు పదహారు లక్షల ఓట్లు పడ్డాయి. ఆమె ప్రజలకు ఇచ్చిన మాట... నిర్మాణమే. యుద్ధమనే విధ్వంసం వద్దంది. వనరుల స్వాధీనం కోసం ప్రపంచ దేశాలతో అమెరికా చేస్తున్న ఆధిపత్యపోరును తీవ్రంగా వ్యతిరేకించింది. విదేశాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కి పిలిపించాలని గళమెత్తింది. మూకుమ్మడిగా ఖైదు చేయడాన్ని, అమెరికా సమాఖ్య ప్రభుత్వ ప్రణాళికలను నిరసించింది. తను అధ్యక్షపదవిలోకి వస్తే అమెరికాను నిరాయుధ దేశంగా మలుస్తానని, ప్రపంచ దేశాల వ్యవహారాల్లో తలదూర్చకుండా ... హింసను ప్రేరేపించకుండా, తటస్థంగా ఉండేలా చూస్తానని చెప్పింది జోర్గెన్సన్. తను ఎన్నికైన మరుక్షణమే ప్రపంచ దేశాల్లోని అమెరికా మిలటరీ ఆపరేషన్స్‌ను నిలిపేసి.. ఆ సైన్యాన్ని స్వదేశానికి రప్పిస్తానని, విదేశాలకు అందించే ఫండ్‌ను ఆపేస్తానని చెప్పింది. సమాఖ్య ప్రభుత్వం విధించే ఇన్‌కమ్‌టాక్స్‌ను రద్దు చేస్తానని మాటిచ్చింది. అమెరికా పౌరుల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు పాటుపడుతూ అమెరికాను సర్వశక్తి దేశంగా తీర్చిదిద్దుతామని, క్రిమినల్ జస్టిస్‌లో మార్పు తీసుకొస్తామనీ విన్నవించుకుంది జోర్గెన్సన్. ‘నేను రాజకీయాల పక్షం కాదు, బ్యూరోక్రాట్స్ పక్షమూ కాదు.. వాషింగ్టన్‌లోని పైరవీకారుల పక్షం అసలే కాదు. నేను ప్రజల పక్షం.. అంటే మీ పక్షం. ఇప్పుడున్న రెండు పార్టీలకూ ప్రజాప్రయోజనాల కన్నా వాషింగ్టన్‌లోని స్పెషల్ ఇంట్రెస్ట్లే ముఖ్యం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కింది. ప్రధానంగా అమెరికా స్థానిక ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వాళ్లను తమ పౌరులుగా గుర్తించనేలేదు’ అంది ఆమె. ఆ ఉపన్యాసానికి ఆకర్షితులయ్యారు ప్రజలు. అమెరికా ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తున్న ప్రపంచ ప్రేక్షకులకూ ఆసక్తి గలిగింది. ఆమె తలపెట్టిన అమెరికా పునర్నిర్మాణపు ఆలోచనలు నచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నిక మీద ప్రపంచ దేశాలు ప్రధానంగా ఆసియా దేశాలు.. ఇంకా చెప్పాలంటే ట్రంప్ గెలుపు ఓటముల మీద రైట్‌వింగ్ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుని సంబరపడ్డమో.. బాధపడ్డమో చేసే (వాణిజ్యం, వీసా వంటి లెక్కలు కాకుండా) దేశాలకూ జోర్గెన్సన్ ఆలోచనా విధానం సంతోషాన్ని కలిగించే విషయం. పెత్తనాల జోలికి వెళ్లకుండా సొంత కుంపట్లో ఎగసిపడ్తున్న నిప్పురవ్వల మీద అమెరికా దృష్టి పెట్టుకుంటే అంతకన్నా ప్రపంచ దేశాలకు కావాల్సిందేముంటుంది? మహిళ కాబట్టే ఆ సమస్యను గ్రహించింది. మహిళ కాబట్టే ఆ సవాలును స్వీకరించే చొరవ చూపించింది. పోరులో నిలబడింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఇరవైమూడు దేశాల్లో ఇలాంటి స్త్రీ శక్తే అధికారంలో ఉంది. ప్రజలకు చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా కునుకు ఉండే భద్రతను కల్పిస్తోంది. ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి రక్షణగా నిలస్తోంది. అందుకే ప్రపంచానికి కావల్సింది వైషమ్యాల విధ్వంసం కాదు.. సమైక్యనిర్మాణం. నిర్మొహమాటం, ధైర్యం, చొరవ కలిస్తే డాక్టర్ జో జోర్గెన్సన్. సౌత్ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ ఆమె. హాకీ ప్లేయర్ కూడా. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జోర్గెన్‌సన్‌లో వ్యాపార దక్షతా మెండే. 1980లో ఏంబీఏ చదివింది. ఐబీఎంలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌గా చేరింది. తర్వాత సొంతంగా సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రారంభించింది. పెళ్లి, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే తన కెరీర్‌కూ బ్రేక్ పడకుండా చూసుకుంది. 1983లో లిబర్టేరియన్ పార్టీలో సభ్యత్వం తీసుకుంది. 2002లో సైకాలజీలో పీహెచ్డీ చేసింది. 2006 నుంచి ప్రొఫెసర్‌గా కొనసాగుతోంది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే. -శరాది -
మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు
పెద్దపల్లికమాన్/సుల్తానాబాద్: జిల్లా కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాంపై రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, అ ధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి హరీశ్‌రా వు సోమవారం ట్విట్టర్ ద్వారా ఆయనకు అభినందనలు తె లిపారు. కరోనాపై యుద్ధంలో స్ఫూర్తిదాయకంగా ని లి చారని, మానవత్వం బతికే ఉంది, మానవత్వంలో దైవత్వం దర్శించుకునేలా చేశారన్నారు. శ్రీరాం సేవలను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రశంసించారు. జిల్లా అధికారులు సంఘం సభ్యులు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రాజన్న, జిల్లా సహకారాధికారి చంద్ర ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వినోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్‌లు అభినందించారు. (అన్నీ తామై ముందుకొచ్చారు) మంత్రి హరీశ్‌రావు ట్వీట్ వైరస్ కారణంగా ఓ వ్యక్తి ఆదివారం మరణించగా అతడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి సిబ్బంది, ఇతర వ్యక్తులు ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో డాక్టర్ శ్రీరాం స్పందించి, రోగి కుటుంబసభ్యుల సహకారంతో మున్సిపల్ ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అపోహలను తొలగించారు. విపత్కర సమయంలో ప్రతీ మనిషి జాగ్రత్తలు పాటిస్తూ మరో మనిషికి తోడుండాలని జిల్లా అధికారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కరోనాపై సమష్టి పోరు.. పెద్దపల్లికమాన్: జిల్లాలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సమష్టిగా కరోనాపై పోరాడుతున్నాం. ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఓ రోగి దురదృష్టవశాత్తు మరణించాడు. కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాల తరలింపు కోసం ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆసుపత్రిలో మార్చురీ అంబులెన్స్ అందుబాటులో లేనందున మృతదేహం తరలింపు కోసం ఇతర వాహనాన్ని ఉపయోగించాం. మృతదేహం తరలింపులో శాఖల మధ్య సమన్వయ లోపం లేదు. కరోనా సోకి మరణించినందున గ్రామంలో బంధువులు మరింత ఇబ్బందికి గురి కావద్దని, డ్రైవర్ రావడానికి సమయం పడుతుందని, కరోనాతో మృతదేహం తరలించే పక్షంలో ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నేనే స్వయంగా శ్మశానవాటికకు తరలించా. కరోనా మృతుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్న. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పకడ్బందీగా చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్న. ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటించి మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుతున్న. – డాక్టర్ శ్రీరాం, జిల్లా సర్వేలెన్స్ అధికారి -
చొక్కాలు చింపుకున్న డాక్టర్లు
సాక్షి, గద్వాల: ఆ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లేగాక జిల్లాస్థాయి అధికారులు.. ఇవన్నీ మర్చిపోయి వీధిలో ఆకతాయిల మాదిరి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గద్వాల పశుసంవర్ధక శాఖలో డీవీఏహెచ్‌ఓగా డాక్టర్ కేశవసాయి, ఏడీగా డాక్టర్ రమేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో హరితహారం నిర్వహించగా కలెక్టర్ శృతిఓఝా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మొక్కలను నాటి వెళ్లిన అనంతరం ఈ ఇద్దరు అధికారుల మధ్య వివాదం రేగింది. ఎలాంటి సమచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ డీవీఏహెచ్‌ఓ చాంబర్లోకి ఏడీ డాక్టర్ రమేష్ వెళ్లి డాక్టర్ కేశవసాయిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు దూషించు కుని బాహాబాహీకి దిగారు. దీంతో రమేష్ తలకు గా యాలు కాగా అక్కడే ఉన్న సిబ్బంది విడిపించారు. డాక్టర్ రమేష్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదనపు కలెక్టర్ వద్దకు పంచాయితీ కాగా ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు అధికారులను కలెక్టరేట్‌కు పిలిపించుకున్నారు. ఎందుకు ఘర్షణ పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యతాయుతంగా మెలగాల్సిన మీరు ఇలా కొట్టుకోవడం ఏమిటి..’ అని మందలించారు. అనంతరం సంఘటన జరిగిన పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఆర్డీఓ రాములు వెళ్లి విచారణ జరిపారు. ముందుగా దాడికి దిగారు.. ముందుగా నా చాంబర్‌కు ఏడీ డాక్టర్ రమేష్ వచ్చి దూషిస్తూ అకారణంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో టేబుల్‌పై ఉన్న వస్తువుతో కొట్టాను. – డాక్టర్ కేశవసాయి, డీవీఏహెచ్‌ఓ సమాచారం ఇవ్వనందుకే.. హరితహారంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే విషయం అడుగుదామని ఆయన చాంబర్‌కు వెళ్లి అ డిగా. టేబుల్‌పై ఉన్న వస్తువుతో నా తలపై కొట్టాడు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశా. – డాక్టర్ రమేష్, ఏడీ, పశుసంవర్ధకశాఖ -
కరోనా: ఆస్పత్రికి రాని వైద్యులు
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వైరస్ సోకిన వారికి వైద్యం అందించే సిబ్బంది, వైద్యుల కొరత అధికమవుతోంది. కర్ణాటకలోని శివాజినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 20 మంది నర్స్‌లు, 44 మంది డాక్టర్లు ఉన్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో వైద్యులు ఆస్పత్రికి రావటం మానేశారు. దీంతో కేవలం ఐదుగురు వైద్యులు, 12 మంది నర్స్‌లు మాత్రమే ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తహా మతీన్ స్పందిస్తూ.. ఆస్పత్రికి రావటం మానేసిన వైద్యులు, నర్స్‌లు తిరిగి విధుల్లో చేరాలని ఓ వీడియో సందేశాన్ని ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు వైద్యం అందిచడానికి వైద్యులు లేకపోవటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఒకరు లేదా ఇద్దరు స్టాఫ్‌తో కరోనా బాధితులకు వైద్యం అందించటం కష్టంగా మారిందని పేర్కొన్నారు. (కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్) ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ఎనిమిది మంది కరోనా నిర్ధారణ పరీక్షలను పూర్తి చేసుకొని ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా ఆరుగురు కరోనా బాధితులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో 80 బెడ్లు ఉన్నాయని కానీ, కేవలం ఐదు మంది డాక్టర్లు మాత్రమే పని చేయటం వల్ల ఎక్కువ మందిని చేర్చుకోవటం లేదని తెలిపారు. విధులకు హాజరుకాని వైద్యులు పలు కారణాలు చెబుతున్నారని, కొంతమంది జ్వరం, తలనొప్పితో బాధపడుతునన్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలని తెలిపారు. వైద్యుల కొరతపై డిప్యూటీ సీఎం డాక్టర్ ఆర్ రవీంద్ర స్పందిస్తూ.. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని సమీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్
శ్రీనగర్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ మహమ్మారి డాక్టర్లను సైతం వదలటం లేదు. తాజాగా ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు శ్రీనగర్‌లోని శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రికి చెందినవారు. ఇందులో ఒకరు ఎస్‌కేఐఎంఎస్ బెమినా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ కాగా, మరొకరు శ్రీనగర్‌లోని ప్రభుత్వ దంత కళాశాలలో పనిచేసే డెంటిస్ట్. పాజిటివ్‌గా నిర్థారణ అయన ఈ ఐదుగురు వైద్యుల్లో నలుగురు కోవిడ్-19 రోగికి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే వీరు చికిత్స అందించిన కరోనా బాధితురాలు హబ్బా కదల్ (29) ఆదివారం మృతి చెందారు. (వారిని వెనక్కిపంపిచనున్న అమెరికా, కారణం?) మృతి చెందిన మహిళ నుంచి నలుగురు డాక్టర్లకు కోవిడ్ వైరస్ సంక్రమించినట్లు ఛాతి ఆస్పత్రిలోని పల్మోనాలజీ విభాగధిపతి డాక్టర్ నవీద్ నజీర్ తెలిపారు. ఇక వైరస్ బారినపడి మృతి చెందిన హబ్బా కదల్ శ్రీనగర్‌కి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మహిళ మరణంతో కశ్మీర్లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వైరస్‌తో మృతి చెందిన హబ్బా కదల్ ముందుగా శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు చికిత్స అందించే క్రమంలో ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,188కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డాక్టర్లు, ముగ్గురు నర్సులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా: డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశం ప్రారంభం -
ఆర్ఎంపీతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు
తాడితోట (రాజమహేంద్రవరం): స్థానిక మంగళవారపుపేటలో కరోనా బాధితురాలికి చికిత్స చేసిన ఆర్ఎంపీకి కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అతడి ద్వారా మరి కొందరికి వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ ఆర్ఎంపీకి మంగళవారపుపేటలో క్లినిక్ ఉండగా, ఆయన నివాసం నారాయణపురంలో ఉంది. అక్కడ కూడా అతడు చాలామందితో సన్నిహితంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ధవళేశ్వరంలోని ఐఓసీఎల్ గృహాల్లో కూడా ఆయన కొంతమందితో సన్నిహితంగా ఉన్నాడని భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆర్ఎంపీకి సన్నిహితంగా ఉండే వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. మంగళవారపుపేటలో కరోనా పాజిటి వ్ వచ్చిన మహిళ ఆవ రోడ్డులోని బంధువులను కలిసినట్టు తెలియడంతో అక్కడి వాంబే గృహాల్లో మరో నలుగురిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. బొమ్మురు క్వారంటైన్లో 103 మందికి, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 86 మందికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. రెడ్ జోన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు రాజమహేంద్రవరం సిటీ: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రెడ్జోన్లలో నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారపుపేట, నారాయణపురం వాంబే కాలనీ ఏరియా, 16వ డివిజన్ ప్రాంతాలతో పాటు మున్సిపల్ కాలనీని రెడ్ జోన్లుగా ప్రకటించి కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వలంటీర్లు, ఆశ, హెల్త్ వర్కర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, రెడ్ జోన్లలో రాకపోకలపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ట్యాంకర్లతో తీసుకు వచ్చి పిచికారీ చేస్తున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు రాజమహేంద్రవరం క్రైం: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని అర్బన్ జిల్లా ఎస్పీ షీమూషి బాజ్‌పేయి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు తమ వద్దకు ఎవరైనా దగ్గు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వారికి వైద్యం చేయకూడదన్నారు. దీన్ని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వృత్తి ధర్మం మరచిన ప్రైవేటు
సాక్షి, అనంతపురం: కరోనా కల్లోలంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఈ కష్టకాలంలో సాయంగా నిలవాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు బాధ్యత మరిచాయి. ఎమర్జెన్సీ సేవలతో పాటు ఓపీ తప్పనిసరిగా చూడాలని కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్ ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులను ఆదేశించినా.. కొందరు వైద్యుల్లో మార్పు రాలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ నిక్కచ్చిగా చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినా.. మరికొందరు మాత్రం తీరు మార్చుకోలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృతమైన సేవలందిస్తున్న ఈ తరుణంలో ప్రైవేటు వైద్యులు అండగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 90 శాతం ఆస్పత్రులు మూత.. జిల్లాలో మొత్తం 258 ప్రైవేట్ ఆస్పత్రులుండగా.. వీటిలో ప్రముఖ ఆస్పత్రులు మాత్రమే తెరిచారు. మిగతా 90 శాతం ఆస్పత్రులను మూసేశారు. వాస్తవంగా రోజూ వేల సంఖ్యలో రోగులు వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి. ఆస్పత్రులు మూతపడడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయం.. భయం కరోనా నేపథ్యంలో ఆస్పత్రులను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో మూడు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు తమ ఆస్పత్రులను ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనని ముందస్తుగా వైద్య సేవలు బంద్ చేశారు. జిల్లాలోని చాలా ఆస్పత్రులు మూతపడగా.. ఇబ్బంది పడుతున్న రోగులు ఆరోగ్యశాఖాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పటికే కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి సైతం వెళ్లగా ఆయన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోగులకు ప్రత్యక్ష నరకం.. డయాబెటిక్‌తో బాధపడుతున్న శ్రీనివాస్ నగరంలోని సాయినగర్‌లోని ఓ ఆస్పత్రిలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇదివరకే హార్ట్ స్ట్రోక్ రాగా...వెంటనే ఆస్పత్రిలో చేరగా గండం గడిచింది. ప్రస్తుతం అతను క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అతను వెళ్లే ఆస్పత్రి వారం రోజులు క్రితం మూసివేయగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈయన రెవెన్యూ కాలనీకి చెందిన రాము. తన కూతురు జేష్వితకు సోమవారం విరేచనాలు, జ్వరం రావడంతో ఆస్పత్రులవైపు పరుగుతీశాడు. కానీ నగరంలో చాలా ఆస్పత్రులు మూసివేశారు. బిడ్డ పరిస్థితి చూసి రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ ద్వారా ఓ వైద్యున్ని సంప్రదించి మందులు తీసుకుని వెళ్లిపోయాడు. ..జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూసివేయగా.. రాము లాంటి వారు ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లాలోని 258 ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఎమర్జెన్సీ సేవలు అందించాలని, ఎవరైనా తాళం వేస్తే ఎస్మా చట్టం కింద లైసెన్స్‌లను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించినా ప్రైవేటు వైద్యులు తీరు మారలేదు. హౌసింగ్‌బోర్డుకు చెందిన ఆంజనేయులు గుండె సంబంధ వ్యాధితో పాటు డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. నగరంలోని బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. ఆ ఆస్పత్రి మూసివేయడంతో ఆయన సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ కరోనా కేసుల నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారు. అదే ప్రైవేట్ ఆస్పత్రి తెరిచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నగరానికి చెందిన దంపతులకు మూడ్రోజుల క్రితం ఓ పాప జన్మించింది. జాండిస్ లక్షణాలు కనిపించడంతో చిన్నారిని ఫోటోథెరపీలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో వారు నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లగా ఎక్కడా చేర్చుకోలేదు. మూడ్రోజుల బిడ్డను తీసుకుని వారు పరుగులు పెట్టారు. చివరకు బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చిన్నారిని అడ్మిషన్ చేసుకోగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు మూసివేయగా.. కిడ్నీ, మధుమేహం, హైపర్‌టెన్షన్, మానసిక ఒత్తిడి, గుండె తదితర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు అవస్థలు పడుతున్నారు. వీరికి రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్ తప్పనిసరి. రెగ్యులర్‌గా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు క్రమం తప్పకుండా వాడకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. -
కరోనా నుంచి తప్పించుకోండిలా..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీచేసింది. తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి ఉపయోగించరాదని పేర్కొంది. మరిన్ని వివరాలకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం నెంబర్ 91-11-23978046 ను, ncov2019@gmail.com ను సంప్రదించాలని తెలిపింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ⇒ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి ⇒ సమూహాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ⇒ మీ కళ్లు, ముక్కు, నోటిని టచ్ చేయడం విరమించాలి ⇒ దగ్గు, తుమ్ములు వస్తే ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి ⇒ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి ⇒ మాస్క్‌ను ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ⇒ ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు ⇒మాస్క్ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి ⇒ మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి చదవండి : హైదరాబాద్‌లో తొలికేసు: కరోనా అలర్ట్ -
సెక్యూరిటీ గార్డే బలి పశువు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యానికి ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు బలయ్యాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే అర్ధంతరంగా అతడిని విధుల నుంచి తొలగించడంతో ఖమ్మంలోని పెద్దాస్పత్రి మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ఆదివారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమయానికి డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఇంకా పలు పత్రికల్లో వార్తలు రావడం, చానళ్లలో ప్రసారం కావడంతో పెద్దాస్పత్రిలో ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, సెలైన్ ఎక్కించిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడంపై సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించిన డాక్టర్లు, నర్సులపై చర్య తీసుకోకుండా సెక్యూరిటీ గార్డును బలిపశువును చేయడమేంటని? ఖండించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. సెక్యూరిటీ గార్డును విధుల్లోకి తీసుకొని బాధ్యులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పదిలం.. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కాన్పుకు వచ్చే గర్భిణులకు ప్రసవం తర్వాత వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి..డిశ్చార్జ్ అయ్యే వరకు..డాక్టర్లు, నర్సులు పర్యవేక్షిస్తూ..వైద్యసేవలు అందించాలి. 24 గంటలూ షిఫ్టుల వారీగా వారికి డ్యూటీలు వేస్తారు. కానీ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం, వారి స్వంత క్లీనిక్‌లు చూసుకోవడంపై దృష్టి పెడుతుండటంతో బాలింతలు, చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదనేది ఆరోపణ. సమయానికి ఎవ్వరూ అందుబాటులో ఉండక..కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అక్కడి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు బాలింతలకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే..తాజాగా సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సదరు గార్డు సెలైన్ పెట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను వదిలేసి తాత్కాలిక ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రక్షించేందుకే సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారని, ఎలాంటి విచారణ చేపట్టకుండా..తీసేయడం అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. డబ్బులు వసూలు చేస్తున్నారా? డెలివరీ వీడియో తీశారా? – ప్రత్యేకాధికారి విచారణ పెద్దాస్పత్రిలో చోటు చేసుకున్న వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారును ఆదేశించింది. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజశేఖర్ బాబు సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు, నర్సులను వేర్వేరుగా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డు సెలైన్ పెట్టిన సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అందుబాటులో లేనిదెవరు? తదితర విషయాలపై విచారించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ప్రసవించిన సమయంలో మగ, ఆడ పిల్లలు పుడితే ఒక్కోరేటు పెట్టి పేషంట్ల వద్ద నుంచి డబ్బులు గుంజుతున్న విషయంపై కూడా అడిగారు. డాక్టర్లకు స్వంతంగా ఎవరెవరికి క్లీనిక్‌లు ఉన్నాయో తెలుసుకున్నారు. గత నెల ప్రసవ సమయంలో వీడియోలు తీసిన ఘటనపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి ఆర్ఎంఓ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ పాల్గొన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కించిన ఘటనకు సంబంధించి..పూర్వాపరాలు విశ్లేషించి, ఇంకా చోటు చేసుకున్న వరుస ఘటనలకు కారణమైన బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. డాక్టర్లు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్ వదిలి వెళ్లకూడదు. ప్రసవమప్పుడు బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఇంటికి పంపిస్తాం. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకోసం స్వతహాగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రేను అతి త్వరలో అందుబాటులోకి తెస్తాం. – రాజశేఖర్ బాబు, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి -
నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
నక్సల్స్‌లో చేరండి.. కాల్చిచంపుతాం!
ముంబై: మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ వైద్యుల వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యమంటే ఇష్టం లేని ఇలాంటి(వైద్యులు) వాళ్లు నక్సల్స్‌లో చేరాలి. అప్పడు వాళ్లను ప్రభుత్వం కాల్చిచంపుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో జెనరిక్ మందుల షాపును అహిర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు పాల్గొనకపోవడంపై స్పందిస్తూ..‘ ఈ కార్యక్రమానికి మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ వచ్చారు. సీనియర్ వైద్యులు ఎందుకు రాలేదు? నక్సల్స్‌కు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు(వైద్యులకు) ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఇలాంటి వాళ్లందరూ నక్సల్స్‌లో చేరాలి. ఒకసారి నక్సల్స్‌లో చేరిన మిమ్మల్ని కాల్చిచంపుతాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గర్భాశయంలో సూదిని వదిలేశారు!
► ఢిల్లీలోని శ్రీజీవన్ ఆసుపత్రి వర్గాల నిర్వాకం ► ఆస్పత్రికి రూ.30 లక్షలు జరిమానా విధించిన డీఎస్‌సీఆర్‌సీ న్యూఢిల్లీ: ఓ ఆసుపత్రికి ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదపరిష్కార సంస్థ (డీఎస్‌సీఆర్‌సీ) 30 లక్షలు జరిమానా విధించింది. ఢిల్లీలోని శ్రీజీవన్ ఆసుపత్రిలో 2009లో ఓ మహిళ ప్రసూతి చికిత్స చేయించుకోగా.. ఆమె గర్భాశయంలో ఓ సూదిని సిబ్బంది అలాగే వదిలేశారు. కొన్నినెలల తర్వాత ఈ విషయం బయటపడింది. గర్భాశయం దెబ్బతిని ఆమె మరోసారి గర్భం ధరించలేని స్థితికి చేరుకుంది. దీనిపై బాధితురాలు జిల్లా వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించగా.. ఆమెకు రూ.3 లక్షలు పరిహారంగా అందించాలని ఆసుపత్రిని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని డీఎస్సీఆర్సీలో సవాలు చేసిన ఆసుపత్రికి.. తాజాగా అక్కడా చుక్కెదురైంది. జిల్లా సంఘం నిర్ణయాన్ని సమర్థించిన డీఎస్‌సీఆర్‌సీ.. 30 లక్షలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో డిపాజిట్ చేయాలని ఆసుపత్రిని ఆదేశించింది. వైద్యుడికి బదులుగా ఫార్మసిస్టు మహిళకు ప్రసూతి చికిత్సచేశాడని ఈ తరహా ఇబ్బందులు ఎంతమందికో ఎదురై ఉండవచ్చని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
'గాంధీ'లో వైద్యుల ఆందోళన
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైద్యాధికారుల విభజన సక్రమంగా లేదంటూ బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. అవుట్ పేషెంట్ విభాగాన్ని మూసివేసి ధర్నాకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోగుల సంబంధీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిరసన
గుంటూరు : ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో సోమవారం వైద్యులు, నర్సులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కరవడం వల్ల కొన్ని రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఓ శిశువు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఓ వైద్యుడ్ని ప్రభుత్వం బదిలీ చేయడంతోపాటు హెడ్నర్స్, స్టాఫ్ నర్స్‌లను సస్పెండ్ చేసింది. అన్యాయంగా తమపై చర్యలు తీసుకున్నారని నర్స్‌లు ఆరోపించారు. వైద్యశాల సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ను తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని ఆయన బదులిచ్చారు. -
విజయనగరంలో 'వైద్యం' బంద్
పార్వతీపురం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం విధులను బహిష్కరించారు. కలెక్టర్ తీరుకు నిరసనగా వారు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇటీవల ఓ గర్భిణికి వైద్యం అందించడంలో అలసత్వం చూపారనే ఆరోపణలతో పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడ్ని జిల్లా కలెక్టర్ నాయక్ బదిలీ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ వైద్యులు, సిబ్బంది శనివారం నిరసనకు దిగారు. -
ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు
ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఉక్తాపూర్ కాలనీకి చెందిన కళ్యాణి(24) పురుటి నొప్పులతో గత శనివారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు అపరేషన్ చేసి మృత శిశువును తీశారు. దీంతో శోక సంద్రంలో మునిగిన ఆమె ఇంటికి వెళ్లింది. అయితే ఆమెకు రెండు రోజులుగా తిరిగి కడుపు నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడంది. దీంతో ఆమెకు తిరిగి ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన బాధితులరాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
సూరీడుకు చిర్రెత్తుతోంది..!
జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్: మార్చి నెలలోనే ఎండలు మండుతుండటంతో డయేరియాతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని వైద్యు లు సూచిస్తున్నారు. గురువారం రోజు పగ టి ఉష్ణోగ్రతలు ఏకంగా 40.33డిగ్రీలకు చేరింది. గతేడాది ఏప్రిల్ మాసంలో ఇవి నమోదయ్యాయి. అదే విధంగా రాత్రి వేళ ఉక్కబోత పెరగటంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలపాలవుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉండే అభ్యర్థులు, రాజకీయ నేతలు మినహాపల్లెల్లో పగటిపూట పూర్తిగా నిశబ్దవాతావరణం నెలకొంది. పట్టణం, పల్లె తేడా లేకుండా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు... ఎండలు పెరగటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గంగాపూర్‌పీహెచ్‌సీలో గత కొద్దిరోజులు గా ఓపికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వాంతులు, విరేచనాలతో చికిత్సకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి మూడో వారం నుంచి రోజూ 15మందికి తగ్గకుండా ఇన్‌పేషెం ట్లుగా చేరుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి... ఎండలు మండుతుండటంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ఆ ప్రకారం వదులుగా ఉన్న కాటన్‌దుస్తులు ధరించాలి. చిన్నపిల్లలకు కనీసం రెండు పర్యాయాలు గోరువెచ్చటి నీటితో స్నానం చేయించటం, ఎండలో తిరగకుండా చూడాలి. డీహైడ్రేషన్ అయితే ఎలక్ట్రాల్ పౌడర్ తాపాలి. గర్భిణిల్లో మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వారు ప్రతి అరగంటకోమారు గ్లాసునీటిని తాగాలి. బైక్‌పై వెళ్లేవారు తప్పనిసరిగా క్యాప్ ధరించటంతోపాటు తరచూ నిలిచినీళ్లు తాగు తూ వెళ్లాలి. కొబ్బరి నీళ్లు తాగటం అందరికి శ్రేయస్కరం.