సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ రాష్ట్రానికి నియంతలా మారిన కేసీఆర్.. ముందు తన రాజకీయ క్రీడలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. తాము ఏడాది క్రితమే అన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యుల నియామకానికి చిట్టా ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం గాడిదలు కాసిందా? అని ప్రశ్నించారు. నవ్వులాటలు, గాలి మాటలతో ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టారని మండిపడ్డారు.
వద్దంటే ఎన్నికలు పెట్టి నాగార్జునసాగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయ్యారని విమర్శించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ఒక్కటే శరణ్యమని, కనీసం 15 రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని కోరారు. వైరస్‌ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలో ఒక యాప్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల వివరాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఎప్పుడు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ కావాలో ఈ ప్రభుత్వం దగ్గర యాక్షన్ ప్లాన్ లేదని మండిపడ్డారు.
చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క భేటీ
Comments
Please login to add a commentAdd a comment