జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడీ రమేష్
సాక్షి, గద్వాల: ఆ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లేగాక జిల్లాస్థాయి అధికారులు.. ఇవన్నీ మర్చిపోయి వీధిలో ఆకతాయిల మాదిరి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గద్వాల పశుసంవర్ధక శాఖలో డీవీఏహెచ్‌ఓగా డాక్టర్ కేశవసాయి, ఏడీగా డాక్టర్ రమేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో హరితహారం నిర్వహించగా కలెక్టర్ శృతిఓఝా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మొక్కలను నాటి వెళ్లిన అనంతరం ఈ ఇద్దరు అధికారుల మధ్య వివాదం రేగింది. ఎలాంటి సమచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ డీవీఏహెచ్‌ఓ చాంబర్‌లోకి ఏడీ డాక్టర్ రమేష్ వెళ్లి డాక్టర్ కేశవసాయిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు దూషించు కుని బాహాబాహీకి దిగారు. దీంతో రమేష్ తలకు గా యాలు కాగా అక్కడే ఉన్న సిబ్బంది విడిపించారు. డాక్టర్ రమేష్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అదనపు కలెక్టర్ వద్దకు పంచాయితీ
కాగా ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు అధికారులను కలెక్టరేట్‌కు పిలిపించుకున్నారు. ఎందుకు ఘర్షణ పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యతాయుతంగా మెలగాల్సిన మీరు ఇలా కొట్టుకోవడం ఏమిటి..’ అని మందలించారు. అనంతరం సంఘటన జరిగిన పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఆర్డీఓ రాములు వెళ్లి విచారణ జరిపారు.
ముందుగా దాడికి దిగారు..
ముందుగా నా చాంబర్‌కు ఏడీ డాక్టర్ రమేష్ వచ్చి దూషిస్తూ అకారణంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో టేబుల్‌పై ఉన్న వస్తువుతో కొట్టాను.
– డాక్టర్ కేశవసాయి, డీవీఏహెచ్‌ఓ
సమాచారం ఇవ్వనందుకే..
హరితహారంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే విషయం అడుగుదామని ఆయన చాంబర్‌కు వెళ్లి అ డిగా. టేబుల్‌పై ఉన్న వస్తువుతో నా తలపై కొట్టాడు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశా. – డాక్టర్ రమేష్, ఏడీ, పశుసంవర్ధకశాఖ
Comments
Please login to add a commentAdd a comment