బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వైరస్ సోకిన వారికి వైద్యం అందించే సిబ్బంది, వైద్యుల కొరత అధికమవుతోంది. కర్ణాటకలోని శివాజినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 20 మంది నర్స్‌లు, 44 మంది డాక్టర్లు ఉన్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో వైద్యులు ఆస్పత్రికి రావటం మానేశారు. దీంతో కేవలం ఐదుగురు వైద్యులు, 12 మంది నర్స్‌లు మాత్రమే ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తహా మతీన్ స్పందిస్తూ.. ఆస్పత్రికి రావటం మానేసిన వైద్యులు, నర్స్‌లు తిరిగి విధుల్లో చేరాలని ఓ వీడియో సందేశాన్ని ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు వైద్యం అందిచడానికి వైద్యులు లేకపోవటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఒకరు లేదా ఇద్దరు స్టాఫ్‌తో కరోనా బాధితులకు వైద్యం అందించటం కష్టంగా మారిందని పేర్కొన్నారు. (కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్)
ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ఎనిమిది మంది కరోనా నిర్ధారణ పరీక్షలను పూర్తి చేసుకొని ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా ఆరుగురు కరోనా బాధితులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో 80 బెడ్లు ఉన్నాయని కానీ, కేవలం ఐదు మంది డాక్టర్లు మాత్రమే పని చేయటం వల్ల ఎక్కువ మందిని చేర్చుకోవటం లేదని తెలిపారు. విధులకు హాజరుకాని వైద్యులు పలు కారణాలు చెబుతున్నారని, కొంతమంది జ్వరం, తలనొప్పితో బాధపడుతునన్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలని తెలిపారు. వైద్యుల కొరతపై డిప్యూటీ సీఎం డాక్టర్ ఆర్ రవీంద్ర స్పందిస్తూ.. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని సమీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment