కాకులతో సహపంక్తి భోజనం..సమస్యలతో సహవాసం
- ఇదీ వెలుగు పాఠశాల
- విద్యార్థినుల పరి(దు)స్థితి
- అపరిశుభ్రంగా వంటశాల, మరుగుదొడ్లు
- రెండు రోజులుగా విద్యార్థినులు అస్వస్థత
- గోప్యంగా ఉంచుతున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
లక్కిరెడ్డిపల్లె: స్థానిక వెలుగు పాఠశాలలో విద్యార్థినులు సమస్యలతో సతమతమవుతున్నారు. రెండు రోజుల నుంచి కొందరు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ‘సాక్షి’కి తెలియడంతో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లగా.. అక్కడ అపరిశుభ్ర వాతావర ణం కనిపించింది. తరగతి గదులు, భోజనశా ల, వంటశాల, పాఠశాల ఆవరణం చెత్తా చెదారంతో పేరుకుపోయాయి. విద్యార్థినులు నివసిస్తున్న డార్మెటరీ నుంచి సిక్‌రూం, మరుగుదొడ్లు వరకు భరించలేని కంపు కొడుతున్నాయి.
ప్రిన్సిపాల్‌తో కలిసి పాఠశాలను
పరిశీలించిన ‘సాక్షి’: ప్రిన్సిపాల్ పరమేశ్వరీతో కలిసి పరిశీలించి అపరిశుభ్రతపై ఆమెను అడగ్గా.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా అందుబాటులో వుండక పోవడంతో ఐదు, ఆరు రోజులకొక్కసారి శుభ్రం చేస్తుంటారని చెప్పుకొచ్చారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను కలుద్దామని ‘సాక్షి’.. ప్రిన్సిపాల్‌ను అడగ్గా మా పాఠశాలలో అలాంటిది ఏమీ లేదని, మీకు ఎవ్వరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె పేర్కొంది. అయినా ‘సాక్షి’ సిక్ రూం, హౌస్‌రూంలకు వెళ్లి చూడగా అప్పటికే అక్కడి నుంచి విద్యార్థులను ఉపాధ్యాయులతో కలిసి బయటకు పంపివేశారు. అయితే ఆరుగురు వాంతులు, విరేచనాలతో, ఇద్దరు కామెర్లతో, మరో ముగ్గురు జ్వరంతో బాధ పడుతున్నట్లు కొందరు విద్యార్థుల ద్వారా తెలిసింది. వీరికి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
భోజనశాలలో ఈగల మోత:
ఇదిలా ఉండగా.. మధ్యాహ్న భోజనం సమయం కావడంతో ఆమెతోపాటు భోజనశాలకు వెళ్లి చూడగా.. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా దాపురించింది. ఎక్కడైనా మనుషులతో కలిసి భోజనం చేస్తారు. కానీ అక్కడ మాత్రం విద్యార్థులు కాకులతో కలిసి భోజనం చేయాల్సి రావడం బాధకరం. విపరీతమైన ఈగలు, దోమలు, కాకులు, కొందరు విద్యార్థులు చేసుకున్న వాంతులతో భరించలేని దుర్వాసనలో భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఒక్కొక్క ప్లేట్‌లో ఇద్దరేసి అది కూడా సగం పగిలిపోయిన ప్లేట్‌లలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. వారిని ప్లేట్‌లు ఇవ్వలేదా అని అడగ్గా గతంలో వున్న వారికి మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు వచ్చిన వారికి ఇంకా ఇవ్వలేదని తెలిపారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం:
రెండు సిన్‌టెక్స్ ట్యాంకర్లను బయట ఎండలో వుంచారు. అవి మరుగు దొడ్లకు సమీపంలో నేలపై ఉంచడంతో కుళాయిలు మురుగు నీటిలో కలిసిపోయి దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు ఆ మురుగు నీటిలోని కుళాయి ద్వారానే తాగునీటిని పట్టుకుని తాగుతున్నారు. పాఠశాల ఆవరణమంతా చెత్తా చెదారంతో నిండిపోయి కనిపిస్తున్నా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వీరు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే మరింత మంది విద్యార్థినులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.