మా స్కూల్‌లో జాతీయ గీతాన్ని పాడనివ్వం!
అలహాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఊరు, వాడ, ప్రతి బడిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా తమ బడిలోనూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన టీచర్లు, ప్రిన్సిపాల్‌కు యాజమాన్యం నుంచి చుక్కెదురైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తమ స్కూల్‌లో జాతీయ గీతాన్ని ఆలపించడానికి అనుమతివ్వబోనంటూ యజమాని తేల్చిచెప్పాడు. దీనికి నిరసనగా ప్రిన్సిపాల్, సహా ఎనిమిది మంది టీచర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. పంద్రాగస్టునాడు స్కూలులో జెండా ఎగురవేసిన తర్వాత జాతీయగీతాన్ని ఆలపించాలని, ఆ తర్వాత వందేమాతరం, సరస్వతి వందన ఆలాపన చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ రితూ శుక్లా మేనేజ్‌మెంట్‌కు నివేదించారు. అయితే, జాతీయగీతం ఆలపించడం, ఇతర దేశభక్తి గీతాలను పాడటం వల్ల ఓ మతం వారి మనోభావాలు దెబ్బతింటాయని, కాబట్టి దీనిని అంగీకరించబోనని మేనేజర్ చెప్పారు. దీంతో మరో వర్గానికి చెందిన ఎనిమిది టీచర్లు సహా ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు విద్యాశాఖ తెలిపింది.
అయితే, తమ స్కూల్ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించొద్దన్న నిర్ణయాన్ని పాఠశాల యజమాని జియా వుల్ హక్ సమర్థించుకున్నారు. మతం, దైవం కన్నా దేశమే మిన్న అని జాతీయ గీతం ప్రబోధిస్తుందని, ఇది తమ మతాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారికి ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళుతామని ఆయన చెప్పినట్టు సమాచారం.