సాక్షి, విశాఖపట్నం: తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అప్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
అలాగే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశాలు జారీచేశారు. తీరప్రాంతంలోని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్(08942 240557) ఏర్పాటు చేశామని తెలిపారు. తీరప్రాంతంలోని మెరైన్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment