గుంటూరులో భారీ వర్షం
Published Fri, Oct 4 2013 2:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
బాపట్లటౌన్/తాడికొండ, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. దాదాపు 30 వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు నీట మునిగాయి. కొద్ది రోజు కిందట కురిసిన వర్షాల నుంచి తేరుకుంటున్న రైతులను ఈ వర్షం ఆందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురవడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, తాడికొండ, పొన్నూరు,రేపల్లె, గుంటూరు నగరం తదితర చోట్ల కుండపోతగా వర్షం పడింది. పంటపొలాలు ముంపునకు గురికాగా, పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీటితో రోడ్లు తటాకాలను తలపించాయి.
బాపట్లలో ఎనిమిది ,తాడికొండ, అమరావతి ప్రాంతాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. కొండవీటివాగు పొంగి ప్రవహిస్తోంది. లాం గ్రామం వద్ద లోలెవల్ చప్టాపై మూడు అడుగుల ఎత్తున వాగునీరు ప్రవహిస్తుండటంతో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు గుంటూరు-అమరావతి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో నెలరోజుల కిందట నాట్లువేసిన వరి పొలాలు ముంపునకు గురికావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నరసాయ పాలెం, కంకటపాలెం, జమ్ములపాలెం, ముత్తాయపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, మురుకుంటపాడు, వెదుళ్లపల్లి తదితర గ్రామాల్లోని సుమారు 10 వేల ఎకరాల్లోని వరి పైరు ముంపునకు గురైంది.అలాగే కర్లపాలెం మండలంలోని వెయ్యి ఎకరాల్లోని పైరు కూడా నీట మునిగింది. ఈ రెండు ప్రాంతాల్లో వరి,వేరుశనగ పంటలకు ఈ వర్షం చెరుపు చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అన్నదాతకు అగచాట్లు...: అన్నదాతలకు ఈ ఏడాది అడుగడుగునా అగచాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. విత్తనాలు చల్లింది మొదలు వరుణుడు దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి నారుమళ్లు మొత్తం పాడైపోయాయి. చేసేది లేక బాపట్ల ప్రాంతంలోని రైతులు సెంటు వరి నారు రూ. 1200 నుంచి 1500 వరకు కొనుగోలు చేసి నాట్లు పూర్తి చేశారు. పొలాలు నీటి ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటుండగా గురువారం కురిసిన వర్షం రైతులను మరో దెబ్బకొట్టినట్టయింది.
కాల్వ కట్టకు మూడు చోట్ల కోత...
గుంటూరు: భారీ వర్షాల కారణంగా సాగునీటి కాల్వల్లో నీటిపరిమాణం బాగా పెరిగింది. అప్పాపురం మెయిన్ కాల్వలో 300 క్యూసెక్కుల నీటి విడుదల జరగ్గా, వర్షపునీరు తోడై కాల్వ కట్టలు మూడు ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర కోతకు గురయ్యాయి. వట్టిచెరుకూరు, కోవెలమూడి, పాతరెడ్డిపాలెం గ్రామాల సరిహద్దుల్లో కాల్వ కట్ట మీటరు లోతున కోతకు గురైంది. దీంతో ఆయకట్లు రైతులు పంటలు మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితిని సమీక్షిస్తామని ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్‌బాబు పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ కూడా పొంగిప్రవహిస్తోంది.
Advertisement
Advertisement