శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం : కుండపోత వర్షం
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బీభత్సం మొదలైంది. కవిటి, ఉద్ధానం గ్రామాలలో ప్రచండ గాలులు వీస్తున్నాయి. భీకర గాలులకు చెట్లు కూలిపడిపోయాయి. కుండపోతగా వర్షం కురుస్తోంది. సొంపేటలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
వేలాది కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు, కచ్చా ఇళ్లు కూలిపోతున్నాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ స్తంభించిపోయింది. బందరువానిపేట, పూడిలంక, ఒంటూరు, ఈదుపురం, ఇద్దివానిపాలెం, కపాసుకుద్ది, నువ్వలరేవు, మంచినీళ్లపేట, బారువ తదితర తీర గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
ఒడిషాలోని గోపాల్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. ఉత్తర కోస్తా, ఒడిషాలలో అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలలో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గోపాల్‌పూర్‌లో పై-లిన్ తుపాను భీకర రూపం దాల్చింది. వాహనాలు కొట్టుకుపోయేలా గాలి వీస్తోంది. భీకరగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. గోపాల్‌పూర్ వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. గోపాల్పూర్ గ్రామస్తులు ముందు జాగ్రత్తగా బరంపూర్ తరలి వెళ్లిపోయారు. ఇళ్లకు కాపలాగా ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. తుపానుకు వారూ వణికిపోతున్నారు.
* తుపాన్ కంట్రోల్ రూమ్ల ఫోన్ నెంబర్లు:
శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్
రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800
నెల్లూరు: 1800 425 2499, 08612 331477