
సాక్షి, అమరావతి బ్యూరో: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై సోమవారం జోరున వర్షం కురిసింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అరగంటపాటు వర్షం పడింది. క్యూలైన్లలో చలవ పందిర్లు వేసినప్పటికీ గాలుల బలంగా వీచడంతో భక్తులు తడసి ముద్దయ్యారు. పందిర్లలో చాలా వరకు నీరు కారడంతో సమస్య మరింత అధికమయింది. ముఖ్యంగా చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు వర్షంలో తడవటంతో చలికి వణికారు. తల్లులు తమ బిడ్డలను తడవకుండా జాగ్రత్త పడుతూ పరిగెడుతూనే దర్శనాలు చేసుకున్నారు. వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
కొట్టుకుపోయిన చెప్పులు..
దర్శనానికి వెళ్లాలన్న ఆతృతలో భక్తులు చెప్పులను బహిరంగంగా విడిచి వెళ్లారు. ఉన్నట్టుండి పెద్ద వర్షం పడటంతో నీటి ప్రవాహానికి చెప్పులు కొట్టుకుపోయాయి. దీంతో దర్శనం తర్వాత భక్తులు చెప్పులు లేకుండా వెనుదిరిగారు. చెప్పుల స్టాండ్‌లు దూరంగా పెట్టడంతో క్యూలైన్లల వరకు నడచి రాలేక బహిరంగంగా విడవాల్సి వచ్చిందని పెదవి విరిచారు. దుర్గగుడి అంతరాలయం పక్కన ఉన్న రూ. 300 క్యూలైన్‌లో వర్షం నీరు కారుతుండటం, క్యూలైన్‌లు కదలకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
కొండపైకి వాహనాలు నిలిపివేత..
వర్షం పడటంతో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా దుర్గగుడి ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా ఆపివేశారు. విషయం తెలుసుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కొండపైకి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. క్యూలైన్లలో తిరుగుతూ విద్యుత్ సరఫరా వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వర్షం వల్ల భక్తులకు జరిగే అసౌకర్యాలను వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.
జోరువానలోనూ తగ్గని భక్తిభావం
ఇంద్రకీలాద్రిపై జోరున వర్షం పడుతున్నా.. భక్తుల్లో ఏమాత్రం ఉత్సాహం తగలేదు. వర్షంలో తడుస్తూనే క్యూలైన్లలోకి పరుగులు తీశారు. సాయంత్రం 6 గంటలకు 70 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.