కల్యాణోత్సవం రోజు రాత్రి కురిసిన గాలివానకు చెల్లాచెదురుగా పడి ఉన్న చలువ పందిళ్లు
రాజంపేట/ కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర వారం రాత్రి వర్ష బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళన లకు గురి చేసింది. ఇలాంటి దుర్ఘటనను తాము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
ముందస్తు చర్యలేవీ?
శుక్రవారం సా.7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవ డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని ప్రశ్నిం చినట్లు సమాచారం. మరోవైపు ఒంటిమిట్టలో కల్యాణ వేదిక, రామాలయం పరిసర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జరిగిన నష్టంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా ఆలయ ధ్వజస్తంభంపైభాగంలో వంకరపోయింది.
రామాలయం మూసివేత
బలమైన ఈదురుగాలుల ధాటికి రామాల యంలో తాత్కాలిక నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో శనివారం భక్తులకు స్వామివారి దర్శనం సా. 4 గంటల వరకు లేకుండాపోయింది. సంప్రోక్షణ పేరుతో ఆలయ ద్వారాలను మూసివేసిశారు.
కోదండ రాముడి ఆలయంలో కూలి పడ్డ చలువ పందిళ్లు
తాత్కాలిక నిర్మాణాలవల్లే ప్రాణ నష్టం
శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంపై టీటీడీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో రూ.4.47 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వత నిర్మాణాల గురించి టీటీడీ పట్టించుకోకపోవడంవల్లే భక్తులు బలి కావాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా వర్ష బీభత్సంవల్ల గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 80 మంది గాయపడగా, వీరిలో 32మంది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
తొక్కిసలాటలో కోడల్ని కోల్పోయాం
‘‘నా పేరు సాంబశివరావు. మాది కృష్ణా జిల్లా పెడన మండలంలోని తెలుగుపాలెం. నాతోపాటు నా భార్య అరుణకుమారి, కోడలు ఎం.మీనాతోపాటు ఐదుగురం వచ్చాం. కల్యాణోత్సవంలో స్వామివారిని చూస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయాం. హఠాత్తుగా ఈదరుగాలులు, వర్షం ధాటికి స్తంభాలు నేలకూలాయి. కరెంటు పోయింది. బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నా కోడలు మీనా మృతి చెందింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించి తలంబ్రాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన మేము మృతదేహాన్ని తీసుకుని వెళ్లాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’’.
Comments
Please login to add a commentAdd a comment