కర్నూలు జిల్లా ఆత్మకూరులో భారీగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. అలాగే జిల్లాలోని భవనాసి, గుండ్లకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. పాములపాడు మండలం బానుముక్కల గ్రామ పరిధిలోని మొక్కజోన్న పంట వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. రూ. 40 లక్షల మేర పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే ప్రకాశం జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. దాంతో గుండ్లకమ్మ రిజర్వాయర్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తివేశారు. 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా ఒంగోలు- చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో కలసపాడు, పోరుమామిళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. దాంతో పలు ఇళ్లు, ఆర్టీసీ బస్టాండ్, సినిమా హాళ్లు నీట మునిగాయి. అయితే సగిలేరు డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో అధికారులు 5 గేట్లను ఎత్తివేశారు. డ్యాంలోని నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.