దేవనూరు– సున్నంపల్లె మధ్య కుందూనది దాటుతున్న ప్రజలు
కర్నూలు , మిడుతూరు: భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వారికి అవే కష్టాలు.. వాగులు, వంకలు ఉప్పొంగడం..రాకపోకలు స్తంభించడం పరిపాటిగా మారింది. అవసరమైన చోట వంతెనలు లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒడ్డు చేర్చాలి వస్తోంది. కొన్ని సార్లు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి పలువురు మృతి చెందుతున్నారు కూడా. గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో ఇదే జరిగింది. వ్యవసాయ పనులకు వెళ్లిన ముగ్గురు కూలీలు వంతెన లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కుందూ నదిని దాటుతూ మృత్యువాత పడ్డారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం మేలుకోకపోతే వాగులు, వంకలు మృత్యు కుహరాలుగా మారనున్నాయి.
ప్రమదామని తెలిసినా..
దేవనూరు – సున్నంపల్లె గ్రామాల మధ్య వంతెనను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భయం..భయంగా వాగు దాటాల్సి వస్తోంది. ప్రమాదం అని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలను కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. చెరుకుచెర్ల, భైరాపురం గ్రామాల మధ్య కాకిలేరు వాగుపై లో – లెవల్ బ్రిడ్జి ఉంది. గతంలో ఈ వాగులో మృత్యవాతపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అలగనూరు సమీపంలో ప్రవహించే పీతురు వాగుపై వంతెన లేకపోవడంతో పొలం పనులకు వెళ్లలేకపోతున్నారు. నంద్యాల – నందికొట్కూరు ప్రధాన రహదారిపై తలముడిపి వద్ద , జలకనూరు గ్రామం వద్ద కుందూవాగు ఉధృతి కారణంగా రాకపోకలను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రాకపోకలకు అంతరాయం..
మిడూరు మండల పరిధిలోని పలు గ్రామాల మధ్య వంతెనలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. పలు చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. పూర్తిగా వంతెన నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే సమయంలో రాకపోకలు ఆగిపోతున్నాయి. మండలంలోని చౌట్కూరు గ్రామ పరిధిలో ప్రారంభమయ్యే కుందూవాగు దేవనూరు , సున్నంపల్లె, చింతలపల్లె, ఖాజీపేట, జలకనూరు, తలముడిపి గ్రామాల మధ్య ప్రవహిస్తోంది. కాకిలేరు వాగు మిడుతూరు, చెరుకుచెర్ల, భైరాపురం, తిమ్మాపురం గ్రామాల మీదుగా ప్రవహించి పారుమంచాల చెరువులోకి చేరుతోంంది. ఆయా గ్రామాల మధ్య వాగులపై ఏర్పాటు చేసిన వంతెనలు తక్కువ ఎత్తులో(లో– లెవల్ బ్రిడ్జీ) ఉన్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
నంద్యాల– నందికొట్కూరు ప్రధాన రహదారిలో తలముడిపి వద్ద కుందూవాగుపై వంతెనను ఎత్తులో ఏర్పాటు చేయాలి. ప్రతి ఏటా కుందూవాగు ఉధృతి కారణంగా ప్రధాన రహదారిపై వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కుందూవాగుపై హైలెవల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి..
– పురుషోత్తం రెడ్డి , తలముడిపి
వాగు వస్తే కష్టాలు తప్పవు
ప్రతి ఏటా వానకాలంలో వాగు వస్తే మాకు కష్టాలు తప్పవు. పనుల నిమిత్తం బయటికి వెళ్లాలన్నా, గ్రామానికి చేరుకోవాలన్నా వాగు దాటాల్సిందే. పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి ఇబ్బందికరం. బ్రిడ్జిని ఏర్పాటు చేసి మా కష్టాలు తీర్చాలి. – తిరుపాలు, సున్నంపల్లె
బ్రిడ్జి ఏర్పాటు చేయాలి
వర్షాకాలంలో కుందూ దాటాలంటే ఇబ్బందిగా ఉంది. దేవనూరు – సున్నంపల్లె మధ్య కుందూ నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. పాఠశాలకు చేరుకోవాలంటే కష్టాలు పడుతున్నాం. పనుల నిమిత్తం బయటికి వెళ్లాలంటే గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. – మహబూబ్‌బాషా, ఉపాధ్యాయుడు, సున్నంపల్లె
Comments
Please login to add a commentAdd a comment