సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలీసుశాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుశాఖ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మొదలైన బదిలీల పరంపర జిల్లాలో కొనసాగుతోంది. ఇటీవలే జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ట త్రిపాఠి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో గజరావు భూపాల్ నియమితులయ్యారు. ఉట్నూరు, బెల్లంపల్లి ఏఎస్పీలు అంబర్‌కిశోర్ ఝా, భాస్కర్‌రావులు బదిలీ అయ్యారు. ఇదే క్రమంలో తాజాగా గురువారం బెల్లంపల్లి, నిర్మల్, భైంసా డీఎస్పీలు ఎం.రవీందర్‌రెడ్డి, వి.శేష్‌కుమార్, దేవీదాసులను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా నలుగురు డీఎస్పీల నియామకం
రాష్ట్రవ్యాప్తంగా 49 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా జిల్లాలో ముగ్గురికి స్థానచలనం కలిగింది. రెండేళ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నారన్న కారణంతో వీరిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు కొత్తగా జిల్లాలో నలుగురు డీఎస్పీలను నియమించారు. బెల్లంపల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, నిర్మల్ డీఎస్పీ వి.శేష్‌కుమార్‌లను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం, భైంసా డీఎస్పీ దేవీదాసు నాగులను వెకెన్సీ రిజర్వులో పెట్టారు. వీరి స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న గ్రూపు-1 అధికారులను డీఎస్పీలుగా నియమించారు. భైంసా డీఎస్పీగా ఆర్.గిరిధర్, బెల్లంపల్లికి కె.ఈశ్వర్‌రావు, నిర్మల్‌కు ఎస్వీ మాధవరెడ్డిలను నియమించారు. అలాగే ఉట్నూరు ఏఎస్పీగా ఉన్న అంబర్‌కిశోర్ ఝా బదిలీ కాగా అప్పుడు ఎవరినీ నియమించకపోవడంతో సీహెచ్ చెన్నయ్యను డీఎస్పీగా నియమించారు. రెండు రోజుల్లో కొత్తగా నియమితులైన డీఎస్పీలు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
పోలీసుశాఖలో చర్చ
రెండు మాసాల కిందటే పలువురు సీఐలు, ఎస్సైల బదిలీలు జరిగాయి. మరికొందరు అధికారులకు స్థానచలనం ఉండే అవకాశం ఉంది. కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భూపాల్ పోలీసుశాఖపై పూర్తిగా పట్టు బిగిస్తున్నారు. ఈ క్రమంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే రెండేళ్లు పూర్తయిన పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలిసింది. దీర్ఘకాలికంగా పనిచేసిన పలువురు సీఐలు బదిలీ కాగా రెండేళ్లు పూర్తయిన మందమర్రి, ఆసిఫాబాద్ సీఐలు రఘునందన్‌రావు, సత్యనారాయణతో మరో ఇద్దరు బదిలీ అయ్యే అవకాశాలపై పోలీసుశాఖలో చర్చ జరుగుతుండగా, ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ నాగయ్య ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. డీఎస్పీ పదోన్నతుల జాబితాలో ఉన్న బోథ్ సీఐ రాంగోపాల్‌కు కూడా స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. అలాగే సీఐల పదోన్నతుల జాబితాలో ఎనిమిది ఎస్సైలతోపాటు అవసరమైతే మరికొందరికి బదిలీ ఉండవచ్చంటున్నారు.
బదిలీల పర్వం
Published Fri, Nov 29 2013 6:08 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement