భారీ లారీ భూం ఫట్!!
సాక్షి, రాజమండ్రి: ‘కాళ్ల కింద నేల కదిలిపోయినంత దిగ్భ్రాంతి కలిగింది’ అని రచయితలు రాస్తుంటారు. కానీ, భూకంపాలు సంభవించినప్పుడు కాళ్ల కింద నేల కదిలిపోవడమే కాదు.. భీకరంగా నోరు తెరిచిన రాకాసిలా ఆకాశహర్మ్యాలను సైతం మింగేస్తుంది. అయితే అలాంటిదేమీ లేకుండానే.. పొంచి ఉన్న కొండచిలువ మేకపిల్లను మింగబోయినట్టు.. రాజమండ్రి నగరం నడిబొడ్డున నేల ఓ లారీని ‘మింగబోయిన’ దృశ్యం అక్కడున్న వారిని నిజంగానే దిగ్భ్రాంతుల్ని చేసింది.
బైపాస్ రోడ్లోని ముగ్గుపేట సెంటర్ నుంచి గోరక్షణపేటకు వెళ్లే తారురోడ్లో ఓ సిమెంట్ దుకాణం ఉంది. ఆదివారం అక్కడికి లోడుతో వచ్చిన ఓ లారీని డ్రైవర్ రోడ్డుకు ఓ పక్కగా నిలిపాడు. బస్తాలను దించుతుండగా అకస్మాత్తుగా లారీ ముందు భాగం సుమారు ఐదడుగుల లోతున నేలలోకి దిగబడిపోయి.. వెనుక భాగం గాలిలోకి లేచింది. ఏం జరిగిందో అర్థం కాక డ్రైవర్‌తో పాటు అక్కడున్న అందరూ కలవరపాటుకు గురయ్యారు. ఇంతకీ విషయమేమిటంటే.. లారీ నిలిపి ఉంచిన చోట రోడ్డు కింద నేల డొల్లలా ఉంది. రోడ్డు వేసినప్పుడు రోలర్‌తో తూతూమంత్రంగా చదును చేయించడంతో అడుగున డొల్ల భాగం అలాగే ఉండిపోయింది. లోడు లారీ వచ్చి కాసేపు ఆగేసరికి తట్టుకోలేక కుంగిపోయింది. ఊబిలో దున్నలా నడిరోడ్లో కూరుకుపోయిన లారీని చూసిన వారంతా.. ‘ఔరా! ఇదన్న మాట మన రాజమండ్రిలో రోడ్ల నాణ్యత!’ అంటూ ముక్కున వేలేసుకున్నారు.