డీఎస్‌ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ కోసం జరుగుతున్న నిర్మాణ పనులు
జిల్లాలోని క్రీడా మైదానాలు క్రీడాకారులు ఆడుకునేందుకా లేక హెలీక్యాప్టర్‌ల ల్యాండింగ్ కోసమా అన్న చందంగా తయారయ్యాయి. ఇప్పటికే నగరంలో మూడు శాశ్వత హెలీప్యాడ్‌లు ఉండగా.. తాజాగా మరో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.. అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న ఏకైక డీఎస్‌ఏ క్రీడామైదానంలో. దీంతో క్రీడాకారులు ఉన్న మైదానాలన్నీ హెలీప్యాడ్‌ల నిర్మాణానికే వినియోగిస్తే ఇక తాము ఎక్కడ ఆడుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడప స్పోర్ట్స్: ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు కలిగే ప్రయోజనం సంగతి ఏమో కాని.. క్రీడాకారులకు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. గతంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ సభ కోసం మైదానం చుట్టూ ఉన్న ప్రహరీలను కూల్చారు. తర్వాత ఏడాదికి గాని మళ్లీ ఆ గోడల స్థానంలో గేట్లు ఏర్పాటు చేయలేకపోయారు. తరచూ క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు.. ఉన్న మైదానాలను నాశనం చేస్తుండటం పట్ల క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో ఏమి చేయాలో క్రీడాకారులకు పాలుపోవడం లేదు. ఏదైనా కష్టం వస్తే.. జిల్లాలో ఉన్నతాధికారులకు చెప్పుకుంటారు.. వారి ఆదేశాల మేరకే మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు.
మరో మైదానం బలి
జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఉన్న మైదా నాలు రెండే రెండు.. ఒకటి డీఎస్‌ఏ క్రీడామైదానం.. మరొకటి ఆర్ట్స్ కళాశాల మైదానం. రెండు సంవత్సరాల క్రితం క్రీడాకారులు వ్యతిరేకించినప్పటికీ ఆర్ట్స్ కళాశాల మైదానం మధ్యలో శాశ్వత హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 10 సంవత్సరాల క్రితం రిమ్స్‌లో కూడా శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగర శివారులోని డీటీసీలో కూడా హెలీప్యాడ్ ఉంది. పైగా అందుబాటులో విమానాశ్రయం కూడా ఉంది. ఇన్ని హెలీప్యాడ్‌లు ఉండగా మళ్లీ మరో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికారసంస్థ మైదానం (మున్సిపల్ స్టేడియం) మధ్యభాగంలో హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. మంగళవారం ప్రారంభించిన పనులను చూస్తున్న క్రీడాకారులు ఇక్కడ తవ్వుతున్నారేంటని ప్రశ్నించడంతో ఇక్కడ శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొనడంతో క్రీడాకారులు అవాక్కయ్యారు. ప్రతిరోజూ ఇక్కడ తాము సాధన చేస్తుంటామని.. త్వరలో ఇక్కడ అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే తాము ఎక్కడ సాధన చేయాలంటూ జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అధికారులను ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయమని తామేమీ చేయలేమంటూ డీఎస్‌ఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో క్రీడాకారులు ఉన్నారు.
కలెక్టరేట్ వద్ద ఆందోళన..
డీఎస్‌ఏ మైదానంలోని హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హాకీ క్రీడాకారులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించేందుకు పలువురు క్రీడాకారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హెలీప్యాడ్ నిర్మాణం నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.
హాకీ కోర్టులో హెలీప్యాడ్ ఏర్పాటు వద్దు..
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో హాకీ సాధన చేస్తుం టాం. అయితే మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు వస్తే ఇక్కడ గుంత తవ్వుతున్నారు. అదీ కోర్టు మధ్యలో తవ్వడంతో ఆడుకునేందుకు వీలులేకుండా పోతోంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు నిలిపివేయాలి. – అఖిల్, హాకీ క్రీడాకారుడు, కడప
శాశ్వత నిర్మాణం వద్దు..
డీఎస్‌ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. బాగున్న మైదానాన్ని ఇలా హెలీప్యాడ్ కోసం వినియోగించడం సరికాదు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు ఆపివేయాలి. – కుమార్‌బాబు, క్రీడాకారుడు, కడప
Comments
Please login to add a commentAdd a comment